‘కృష్ణా’ బేసిన్‌లో జలకళ.. నిండుకుండలా పారుతున్న నది

కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల్లో జలకళ ఉట్టిపడుతోంది. ప్రస్తుతం అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. నదిలో సామర్థ్యానికి మించి నీటి ప్రవాహం ఉండటంతో అన్ని ప్రాజెక్టుల క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు

‘కృష్ణా’ బేసిన్‌లో జలకళ.. నిండుకుండలా పారుతున్న నది
  • ప్రాజెక్టుల్లో చేరుతున్న వరదనీరు
  • పూర్తిస్థాయిలో నిండిన అలమట్టి, నారాయణ పూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్
  • సమీప లిఫ్టుల నుంచి ఎత్తిపోతలు
  • విద్యుత్, సాగునీటి అవసరాలకు కొదవలేదంటున్న అధికారులు
  • భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు
  • నడుస్తున్న కాళేశ్వరం మోటర్లు

(విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి)  కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల్లో జలకళ ఉట్టిపడుతోంది. ప్రస్తుతం అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. నదిలో సామర్థ్యానికి మించి నీటి ప్రవాహం ఉండటంతో అన్ని ప్రాజెక్టుల క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. కృష్ణానది మొదట్లో ఉన్న ప్రాజెక్టు కర్ణాటక రాష్ట్రంలోని అలమట్టి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 109.37 టీఎంసీల నీరు నిలువ ఉంది. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా.. వరద ప్రవాహం అధికంగా ఉండడంతో నీటిని దిగువనున్న నారాయణపుర ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. నారాయణపుర ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 31.68 టీఎంసీల నీరు నిలువ ఉంచి మిగతా నీటిని దిగువకు వదులుతున్నారు. నిన్నటి వరకు ప్రాజెక్టులోకి వస్తున్న వరద 2.50 లక్షల క్యూసెక్కులు కాగా 2.60 లక్షల క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ప్రస్తుతం 44 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.68 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.44 టీఎంసీల నీటిని నిలువ చేసిన వచ్చిన వరదను గేట్ల ద్వారా నీటి ని దిగువకు పంపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు 2.80 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. 2.87 క్యూసెక్కుల నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు కుడి,ఎడమ కాలువల ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద లక్షా ఇరవై అయిదు ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇదే కాక నెట్టెంపాడు, కోయిల్ సాగర్, రామన్ పాడు, సరళాసాగర్ ప్రాజెక్టులకు లిఫ్టుల ద్వారా నీరు అందుతోంది. వరదల సమయంలో మాత్రమే ఈ లిఫ్లులకు నీరందించే ప్రక్రియ కొనసాగుతున్నది. కానీ భారీ వర్షాలకు లిఫ్ట్ అవసరం లేకుండానే ఈ ప్రాజెక్టులు నిండాయి.

శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండుకుండను తలపిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.81 అడుగులు కాగా ప్రస్తుతం 198.36 అడుగుల నీరు నిలువ ఉంచి మిగతా నీటిని దిగువనున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 4.78 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 5.19 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాలు నిరంతరం విద్యుత్ ను సరఫరా చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే నీటితో నల్లగొండ జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ ద్వారా రాయలసీమ లోని కర్నూల్, కడప జిల్లాల్లోని 1.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టు నుంచి అధికంగా విద్యుత్ అవసరాలకు నీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు నిండుగా ఉండటంతో సాగునీరు, విద్యుత్ అవసరాలకు ఇబ్బంది ఏమీ ఉండబోదని నీటి పారుదల శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వరదల సమయం లో నీటిని వాడుకునే సదుపాయం ఉన్న పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల మాత్రం పడవు పడింది. అనుకున్న ప్రకారం ఈ లిఫ్ట్ పూర్తి అయి ఉంటే ఈ వరదల సమయం లో నీటిని వాడుకునే అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వలా అలసత్వం వల్ల ఈ ఎత్తిపోతల పథకం పనులు మధ్య లోనే నిలిచి పోయాయి.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెళుతున్న నీటితో దిగువనున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు లో జలకళ సంతరించుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 312 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 4.87 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 4.40 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు కూడా సాగునీటి తో పాటు విద్యుత్ సరఫరా అవసరానికి ఉపయోగ పడుతోంది. ఈ ప్రాజెక్టు నీటి తో ఐదు జిల్లాల్లో ని ఆయకట్టుకు సాగవుతుంది. గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, కృష్ణా, నల్లగొండ జిల్లాల్లోని 22.36 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు నిండుకుండలా ఉండటంతో ఆయకట్టు కు సాగునీరు పుష్కలంగా అందుతుందని అధికారులు అంటున్నారు. కృష్ణా నది బేసిన్ లోని ఈ ప్రాజెక్టు లన్నీ నిండి గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం తో కృష్ణా మాది నిండుగా ప్రవహించడం తో నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

భద్రాచ‌లం ద‌గ్గర గోదావరి ఉగ్రరూపం..
భద్రాచలం పుణ్యక్షేత్రం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ఉదృతితో భద్రాచలం వద్ధ ప్రస్తుతం నీటి మట్టం 51.40 అడుగుల‌కు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 53 అడుగుల‌కు చేరితే చివ‌రి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి ఉగ్రరూపంతో వరదల భయం నేపథ్యంలో లోత‌ట్టు ప్రాంత ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చరించారు. భద్రాచలం వద్ద కల్యాణ కట్ట ప్రాంతం వరకు వరద నీరు చేరింది. స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు, విద్యుత్‌ స్తంభాలు నీటిలో మునిగిపోయాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గోదావరి నీరు పట్టణంలోకి రాకుండా అధికారులు గోదావరి కరకట్టకు ఉన్న స్లూయిజ్‌లను మూసివేశారు. దీంతో పట్టణం నుంచి మురుగునీరు బయటకు వెళ్లకపోవడంతో అధికారులు మోటార్లు ఏర్పాటు చేసి.. నీటిని తోడివేస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ల రన్నింగ్
గోదావరి నదికి వరదల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను ఏడు పంప్‌హౌస్‌లలో అధికారులు నడిపిస్తున్నారు. నంది, గాయత్రి, అనంతగిరి, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ పంప్‌హౌస్‌లలో మోటార్లు నడుస్తుండటంతో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి.

సముద్రంలోకి 9.88 లక్షల క్యూసెక్కులు
ఏపీలోని ధవళేశ్వరం వద్ద 9.88 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవ్వగా .. అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఆనకట్ట వద్ద 11.9 అడుగుల నీటిమట్టం నమోదైంది. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ సూచించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.