SK Joshi : హైకోర్టులో మాజీ సీఎస్ ఎస్ కే. జోషి పిటిషన్ విచారణ వాయిదా
కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ నివేదిక రద్దు, సీబీఐ విచారణపై స్టే కోరుతూ మాజీ సీఎస్ ఎస్.కే. జోషి వేసిన పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. నివేదిక ఎలా వచ్చిందో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

విధాత : కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టీసీ పీసీ ఘోష్ కమిషన్(PC Ghose Commission) నివేదికను రద్దు చేయాలి..సీబీఐ(CBI) విచారణపై స్టే ఇవ్వాలని మాజీ సీఎస్, ఇరిగేషన్ మాజీ సెక్రటరీ ఎస్.కే.జోషి(SK Joshi) వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఘోష్ కమిషన్ నివేదిక రద్దు చేయాలని కోరిన జోషి పిటిషన్ విచారణలో భాగంగా మీ వద్ధ కమిషన్ నివేదిక ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీలో కమిషన్ నివేదిక పెట్టినందునా..మా దగ్గర కూడా ఉందని జోషి తరపు న్యాయవాది తెలిపారు. అసెంబ్లీలో పెడితే ప్రజా ప్రతినిధులు దగ్గర ఉండాలి కానీ మీకు నివేదిక ఎలా వచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. వెబ్ సైట్ లో ఉందని న్యాయవాది సమాధానమివ్వగా.. మేం ఇప్పటికే వెబ్ సైట్ నుంచి నివేదిక తొలగించాలని ఆదేశించాం కదా…అలాంటప్పుడు కమిషన్ నివేదిక ఎలా వచ్చిందో చెప్పాలని స్పష్టం చేసింది. వెబ్ సైట్ లో నివేదికను పెట్టలేదని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు.
ముందు మీకు నివేదిక ఎలా వచ్చిందో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయవాదకి హైకోర్టు ఆదేశించింది. సీబీఐ(CBI) విచారణపై స్టే ఇవ్వాలని జోషి న్యాయవాది కోరగా.. సీబీఐ విచారణ పై మీరెందుకు అడుగుతున్నారని..మీ పిటిషన్ లో సీబీఐ అంశమే లేదు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. జోషికి(Joshi) ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఈ సందర్భంగా న్యాయవాది తెలిపారు. కమిషన్ తనను కేవలం సాక్షిగానే పిలిచారని ఎస్.కె.జోషి తెలిపారు. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు(HighCourt)..పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని జోషికి ఆదేశాలిచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణ వారం రోజులపాటు(వచ్చే బుధవారం) వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.