Medaram Jathara : సమ్మక్క సారలమ్మల జాతరలో జనం తప్పిపోయే సమస్యే లేదు!

మేడారం జాతరలో ఇక తప్పిపోతారనే భయం లేదు! ఏఐ డ్రోన్లు, క్యూఆర్ కోడ్ జియోట్యాగ్‌లు, ఫేస్ రికగ్నిషన్ వంటి అత్యాధునిక టెక్నాలజీతో భక్తుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది.

Medaram Jathara : సమ్మక్క సారలమ్మల జాతరలో జనం తప్పిపోయే సమస్యే లేదు!

విధాత, ప్రత్యేక ప్రతినిధి: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తున్నది. మంత్రి సీతక్క మేడారం జాతర బాధ్యతను తన భుజాలమీద వేసుకుని మరీ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈసారి జాతరలో ఆధునిక సాంకేతికతను పెద్ద ఎత్తున ఉపయోగించనున్నారు. దీంతో మేడారం జాతర సకల హంగులతో కొత్త రూపాన్ని సంతరించుకోనున్నది.

మహా జాతరలో కమాండ్ కంట్రోల్ రూమ్

2026, జనవరి 28 వ తేదీ నుంచి 31 వరకు జరగనున్న ఈ మహా ఉత్సవం కోసం తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి, జాతరలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు.

టీజీ క్వెస్ట్ అత్యాధునిక డ్రోన్ వ్యవస్థ

మేడారం 2.0’లో భాగంగా మేడారం జాతరలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం, భక్తులు ఎవరూ తప్పిపోకుండా ఉండేందుకు, ప్రజలందరికీ సురక్షిత జాతర అనుభవం కలిగించేలా భద్రతను పర్యవేక్షించేందుకు ‘టీజీ-క్వెస్ట్‌’ అనే అత్యాధునిక ఏఐ డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా దాదాపు 30 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం, జంపన్నవాగు, రద్దీ రోడ్లపై డ్రోన్లు నిరంతరం కన్నేసి ఉంచుతాయి.

సాంకేతిక నిఘాలో విధుల్లో 13 వేల మంది పోలీస్ సిబ్బంది

హీలియం బెలూన్లకు అమర్చిన పాన్-టిల్ట్-జూమ్ కెమెరాలు ఎత్తు నుంచి రద్దీని విశ్లేషిస్తాయి. తొక్కిసలాట జరిగేందుకు అవకాశం ఉండే ప్రాంతాలను ముందే పసిగట్టి అధికారులను అవి అప్రమత్తం చేస్తాయి. ఈసారి జాతరలో సుమారు 13 వేల మంది పోలీస్‌ సిబ్బంది ఈ టెక్నాలజీ సర్వైలెన్స్ లో విధులు నిర్వహించబోతున్నారు. మేడారం జాతరలో చాలా పెద్ద సంఖ్యలో జనాలు వస్తారు కనుక తప్పిపోయేవారి శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది.

జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్

ఈసారి జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో జాతరకు వచ్చే భక్తులు ఎవరూ తప్పిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. గత జాతరలో దాదాపు 30 వేల మంది వరకు తప్పిపోయిన అనుభవాలు ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని, ఈసారి ‘జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్’ వ్యవస్థను తీసుకొస్తున్నారు. వొడాఫోన్-ఐడియా సహకారంతో ఈ విధానం అందుబాటులో ఉంటుంది.

క్యూఆర్ కోడ్ గల జియో ట్యాగ్‌లతో తప్పిపోకుండా చర్యలు

_పస్రా, తాడ్వాయి మార్గాల్లోని కౌంటర్లలో వృద్ధులు, పిల్లల వివరాలను నమోదు చేసి వారికి క్యూఆర్ కోడ్ గల జియోట్యాగ్‌లను కడతారు. దీంతో వారు ఎవరైనా తప్పిపోయినా ఈ ట్యాగ్ ను స్కాన్ చేయటం ద్వారా వారి పూర్తి వివరాలు తెలుస్తాయి. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలో అమలు చేయటానికి అధికారులు రంగం సిద్ధం చేశారు.

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేకంగా 12 క్రైమ్ బృందాలు

తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ వివరాల నమోదుకు అవకాశం కల్పించారు. జాతరలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేకంగా 12 క్రైమ్ బృందాలు పనిచేస్తున్నాయి. పాత నేరస్థుల గుర్తింపునకు ఆసుపత్రి ప్రాంగణాలు, పార్కింగ్ స్థలాల వద్ద ‘ఫేస్ రికగ్నిషన్’ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులను గుర్తించే రియల్-టైమ్ అలర్ట్ సిస్టమ్‌ను కూడా సిద్ధం చేశారు.

ఇవి కూడా చదవండి :


Plants Breathing Video : మొక్కలు శ్వాస ఎలా తీసుకుంటాయో తెలుసా..? ఈ వీడియోలో చూడండి
USA Imperialism | వెనెజువెలాపై అమెరికా టెర్రరిస్టు దాడి – కారణాలు, పర్యవసానాలు.. ఇఫ్టు ప్రసాద్‌ విశ్లేషణ