Plants Breathing Video : మొక్కలు శ్వాస ఎలా తీసుకుంటాయో తెలుసా..? ఈ వీడియోలో చూడండి

మొక్కలు శ్వాస తీసుకోవడం ఎప్పుడైనా చూశారా? ఇల్లినాయిస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 'స్టొమాటా ఇన్-సైట్' ద్వారా మొక్కల ఆకులపై ఉండే రంధ్రాల కదలికలు ఇప్పుడు వీడియోలో ప్రత్యక్షంగా చూడవచ్చు.

Plants Breathing Video : మొక్కలు శ్వాస ఎలా తీసుకుంటాయో తెలుసా..? ఈ వీడియోలో చూడండి

మనం శ్వాస తీసుకోవడంలో మొక్కలు (plants) ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనకు ఆక్సిజన్‌ను అందించి.. అవి కార్బన్‌ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయి. ఈ ప్రక్రియ ఫొటోసింథసిస్ ఆధారంగా జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చిన్నప్పుడే చదువుకున్నాం. అయితే, మొక్కలు శ్వాస తీసుకోవడం మనం ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే వాటికి మనుషుల్లా కళ్లు, ముక్కు, చెవులు వంటి ఇంద్రియాలు ఉండవు. మరెలా మొక్కలు శ్వాస తీసుకుంటాయి (how plants breathe)..? ఈ ప్రశ్నకు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు సమాధానం ఇచ్చారు.

మొక్కలు ఆకులపై ఉండే సూక్ష్మ రంధ్రాల (పత్రరంధ్రాలు) ద్వారా శ్వాస తీసుకుంటాయి. అయితే, ఈ ప్రక్రియను ప్రత్యక్షంగా చూడటం ఇప్పటి వరకూ సాధ్యపడలేదు. అలా చూడటం అసాధ్యం కూడా. అయితే, ఈ అసాధ్యాన్ని అమెరికాలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ (University of Illinois) శాస్త్రవేత్తలు సుసాధ్యం చేశారు. మొక్కలు శ్వాసించే విధానాన్ని తొలిసారిగా వీడియో తీసి ప్రపంచానికి చూపించారు. ఇందుకోసం సైంటిస్టులు స్టొమాటా ఇన్ సైట్ (Stomata In-Sight) అనే ఒక పరికరాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. ఇందుకోసం వారికి దాదాపు పదేండ్ల సమయం పట్టింది.

దీని ద్వారా మొక్కల ఆకులపై ఉండే రంధ్రాలు కిరణజన్య సంయోగక్రియ కోసం కార్బన్ డయాక్సైడ్ ను గ్రహిస్తూ.. అదే సమయంలో నీటి ఆవిరిని ఎలా బయటకు పంపుతాయో కళ్లకు కట్టినట్లు వీడియో రూపంలో చూపించారు. టెంపరేచర్, తేమ, కాంతి, కార్బన్ డయాక్సైడ్ వంటి అంశాలను నియంత్రిస్తూ పత్రరంధ్రాల పనితీరును గమనించవచ్చు. ఈ పరిశోధన వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీపై ఇల్లినాయిస్ యూనివర్సిటీ పేటెంట్ రైట్స్ పొందింది. ఈ అధ్యయన వివరాలు ప్రఖ్యాత ‘ప్లాంట్ ఫిజియాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మొక్కలు శ్వాస ఎలా తీసుకుంటాయో ఈ వీడియోలో చూడొచ్చు.


ఇవి కూడా చదవండి :

USA Imperialism | వెనెజువెలాపై అమెరికా టెర్రరిస్టు దాడి – కారణాలు, పర్యవసానాలు.. ఇఫ్టు ప్రసాద్‌ విశ్లేషణ
Pailla Prakash Reddy : టీజీపీఏ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్ రెడ్డి