TGSWREIS | ‘పది’ మార్కుల ఆధారంగానే గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు.. దరఖాస్తు చేసుకోండి ఇలా..!
TGSWREIS | మీరు పదో తరగతి( Tenth Class ) పూర్తి చేశారా..? గురుకుల కాలేజీల్లో( Residential Colleges ) చదవాలనే ఆసక్తి ఉందా..? అయితే ప్రవేశ పరీక్ష రాయకుండానే పదో తరగతి మార్కుల( Tenth Class Marks ) ఆధారంగా గురుకుల కాలేజీల్లో ప్రవేశం పొందొచ్చు. మరి దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

TGSWREIS | హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో( Residential Schools ) ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఐదో తరగతి ప్రవేశాలకు సంబంధించి రాతపరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. మెరిట్ జాబితా కూడా విడుదలైంది. 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నిర్వహించిన భర్తీ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక మిగిలింది గురుకుల కళాశాలల్లో( Residential Colleges ) ఇంటర్ ఫస్టియర్( Inter First Year ) అడ్మిషన్లు మాత్రమే.
అయితే ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాల కోసం గతంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించే వారు. ఆ ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గురుకుల కళాశాలల్లో( Residential Colleges ) సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టేవారు. కానీ ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు గురుకుల సొసైటీ( Residential Society ) మొగ్గు చూపలేదు. పదో తరగతి( Tenth Class )లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎస్సీ గురుకులాల్లో( SC Residential Colleges ) ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి( Alagu Varshini ) అధికారికంగా ప్రకటించారు. ప్రవేశ పరీక్ష లేకుండానే పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా దాదాపు 20 వేల వరకు ఇంటర్ ఫస్టియర్ సీట్లను భర్తీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
50 శాతం సీట్లు ఎస్సీ గురుకుల విద్యార్థులకే..
ఎస్సీ గురుకుల కాలేజీల్లో 50 శాతం సీట్లు ఎస్సీ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులకు, మిగతా 50 శాతం సీట్లు ఇతర సొసైటీలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు, మిగిలిన సీట్లు ఇతర పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు కేటాయించనున్నారు.
ఈ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి
ఎస్సీ గురుకుల విద్యార్థులు దరఖాస్తు సమయంలో కేవలం టెన్త్ హాల్ టికెట్ నంబర్ ఇస్తే సరిపోతుంది. ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా సొసైటీలు, ప్రభుత్వ పాఠశాలలు, ఇతర స్కూళ్లల్లో చదివిన విద్యార్థులు దరఖాస్తు సమయంలో పూర్తి వివరాలు.. హాల్ టికెట్ నంబర్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి.
మెరిట్ ఆధారంగా సీఈవో, నాన్ సీఈవోల్లో ప్రవేశాలు..
పదో తరగతి హాల్ టికెట్ నంబర్ ఆధారంగా డేటా నుంచి దరఖాస్తు చేసిన అభ్యర్థులకు పదో తరగతిలో వచ్చిన మార్కులను సొసైటీ సమీకరిస్తుంది. అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులకు సీఈవోల్లో, మిగతా వారికి మెరిట్ ఆధారంగా నాన్ సీఈవోల్లో సీట్లు కేటాయించనున్నారు.
మే 15 వరకు దరఖాస్తులకు అవకాశం..
ఈ నెల 21 లేదా 22 నుంచి మే 15 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నారు. తదితర వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను https://tgswreis.telangana.gov.in/ సంప్రదించొచ్చు.