Hyderabad Traffic Chaos | హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ నరకం.. గంటకు కిలోమీటరు వేగంతో ‘దూసుకుపోతున్న’ వాహనాలు!
‘చెక్‌పోస్టు నుంచి మాధాపూర్ మెట్రో స్టేషను వరకు ఐదు యూ టర్నులు పెట్టారు. ప్రతి యూటర్నూ ఒక జంక్షనే. అక్కడ ట్రాఫిక్ వాళ్లు ఎవరూ ఉండరు. అడ్డదిడ్డంగా కార్లు, ఆటోలు, బండ్లు వెళుతుంటాయి. కొన్ని చోట్ల రివర్సులో వస్తున్నారు. ఇంతటి దురవస్థ ఎప్పుడూ ఎదుర్కోలేదు. అసలు నరగంలో ఒక నియంత్రణ వ్యవస్థ అంటూ ఉందా అన్న అనుమానం వచ్చింది’ అని ఖైరతాబాద్ నుంచి మాధాపూర్‌కు ప్రయాణించిన ఒక పౌరుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Hyderabad Traffic Chaos | హైదరాబాద్, జూలై 19 (విధాత): హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు చేతులెత్తేసినట్టు కనిపిస్తున్నది. ప్రత్యేకించి వర్షాలు పడినప్పుడు వాహనదారులకు నిత్యం నరకమే కనిపిస్తున్నది. శుక్రవారం నగరాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. ఆ సమయంలో సాయంత్రం బస్సులు, కార్లు, ఆటోలు, మోటరు సైకిళ్లపై ఇళ్లకు బయలు దేరినవారు రెండు నుంచి మూడు గంటల పాటు నరకయాతన అనుభవించారు. ‘కూకట్‌పల్లి ఏడవ దశ ఇండ్ల నుంచి జూబ్లీ హిల్స్‌లో ఉండే ఆఫీసుకు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరితే ఏడుగంటలకు చేరవలసి వచ్చింది. జీవితంమీద విరక్తి పుట్టేంత దారుణమైన అనుభవం ఎదురయింది. సాధారణంగా అరగంటలో ఆఫీసుకు చేరేవాడిని. రెండున్నర గంటలపాటు బంపర్ టూ బంపర్ కారు నడపటం అంటే యమధర్మరాజు గుర్తొచ్చాడు. దారి పొడవునా సిగ్నల్స్ ఉన్నచోట తప్ప ఎక్కడా ట్రాఫిక్ పోలీసుగానీ, జీహెచ్ఎంసీ యంత్రాంగం కానీ కనిపించలేదు’ అని కూకట్‌పల్లి వాసి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఒక కిలోమీటరు దూరం ప్రయాణం చేయడానికి గంట పది నిమిషాలు పట్టింది. రోజంతా చేసిన కష్టం ఒక ఎత్తయితే జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు నుంచి మాధాపూర్ మెట్రోస్టేషన్ వరకు ప్రయాణించడం మరో ఎత్తయింది. పొరపాటున కూడా కారు తీయవద్దని అర్థమయింది. చెక్‌పోస్టు నుంచి మాధాపూర్ మెట్రో స్టేషను వరకు ఐదు యూ టర్నులు పెట్టారు. ప్రతి యూటర్నూ ఒక జంక్షనే. అక్కడ ట్రాఫిక్ వాళ్లు ఎవరూ ఉండరు. అడ్డదిడ్డంగా కార్లు, ఆటోలు, బండ్లు వెళుతుంటాయి. కొన్ని చోట్ల రివర్సులో వస్తున్నారు. ఇంతటి దురవస్థ ఎప్పుడూ ఎదుర్కోలేదు. అసలు నరగంలో ఒక నియంత్రణ వ్యవస్థ అంటూ ఉందా అన్న అనుమానం వచ్చింది’ అని ఖైరతాబాద్ నుంచి మాధాపూర్‌కు ప్రయాణించిన ఒక పౌరుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మాధాపూర్ నుంచి పంజాగుట్ట రావాలంటే ఏరోజైనా తప్పనిసరిగా రెండు మూడు చోట్ల ట్రాఫిక్ జామ్ ఎదుర్కొనాల్సిన పరిస్థితి వాహనదారులకు నిత్యంగా మారింది. చెక్‌పోస్టు వద్ద చుట్టూ తిరిగి వచ్చినా ఒక్కోసారి కిందిదాకా ట్రాఫిక్ ఆగిపోతుంది. ఫ్రీలెఫ్ట్‌కు దారి ఉండదు. ఎన్‌టీఆర్ ట్రస్టు భవన్ వద్దకు రాగానే రోడ్డు సన్నగా మారిపోతుంది. అక్కడ ఓ మూల రోడ్డు మీదకు పొడుచుకుని ఉంది. దానిని తొలగించరు. అక్కడ రోడ్డును విస్తరించరు. ఎన్‌టీఆర్ ట్రస్టు భవన్‌కు ఇబ్బందిలేకుండానే బయటకిపెట్టిన గోడలను తొలగిస్తే దారి ఏర్పడుతుంది. కానీ ఎవరూ పట్టించుకోరు. ఇక కేశవరావు ఇంటి నుంచి పంజాగుట్ట దాకా మళ్లీ బంపర్ టూ బంపర్ నడవాల్సిందే. కేశవరావు జోలికి, చట్నీస్ జోలికి వెళ్లడానికి భయం.
ఆస్కీ క్యాంపసు ముందు 100 అడుగులకు పైగా ఉండే రోడ్డు కేశవరావు ఇంటి ముందు 70 అడుగులకు తగ్గిపోతుంది. చట్నీస్ వద్ద సోమాజిగూడ నుంచి వచ్చే ఫ్లై ఓవర్ కిందికి దిగడం వల్ల పంజాగుట్టవైపు వెళ్లే రోడ్డు 25 అడుగులకు కుంచించుకుపోయింది. ఇక అంజనీ సిమెంట్స్ బిల్డింగు వద్దా అదే పరిస్థితి. ఒక్కోసారి నాగార్జున సర్కిల్ సిగ్నల్ దాకా వాహనాలు ఆగిపోతున్నాయి. పంజాగుట్టదాకా 30 అడుగుల రోడ్డే. ఇక వర్షాలు వచ్చినప్పుడు చూడాలి. ఎక్కడికక్కడ జలమయం అయి వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే నగర పౌరులు నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది ఒకటి రెండు మార్గాల్లో ప్రయాణించినవారి అనుభవం. నగరంలో చాలా రోడ్లలో ఇదే పరిస్థితి.
Peak hours +Rain🥲#hyd #HyderabadRains pic.twitter.com/LmhB7ohUGh
— ChetanRam (@urstcn) July 18, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram