ఇక్ఫాయ్‌ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి అవాస్తవం: వీసీ గణేశ్

హైదరాబాద్ మోకిలలోని ఇక్ఫాయ్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగిందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని వీసీ గణేశ్ తెలిపారు

ఇక్ఫాయ్‌ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి అవాస్తవం: వీసీ గణేశ్

వెల్లడించిన వీసీ, డైరక్టర్లు

విధాత: హైదరాబాద్ మోకిలలోని ఇక్ఫాయ్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగిందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని వీసీ గణేశ్ తెలిపారు. యాసిడ్ కలిపిన బకెట్ ను స్నానానికి ఉపయోగించడంతో ఓ విద్యార్థినికి గాయాలైనట్లుగా వచ్చిన వార్తలపై ఆయన వివరణ ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన వీసీ గణేశ్‌ విద్యార్థినికి వేడి నీటి వల్లే గాయాలైనట్లు తెలిపారు. విద్యార్ధిని బుధవారం రాత్రి 7.20 గంటలకు తన రూమ్ నుంచి బయటకు వచ్చి ఒంటిపై బొబ్బలు వచ్చాయని చెప్పిందని, వెంటనే ఆమెకు యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స అందించామని తెలిపారు.

విద్యార్థిని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, హాస్టల్లోని అన్ని గదుల్లోనూ పటిష్ట భద్రత ఉందని చెప్పారు. ఘటనకు సంబంధించి కారిడార్లో సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులకు అందించామని, క్లూస్ టీమ్ సభ్యులు అక్కడి కొన్ని వస్తువులు తీసుకెళ్లారని, హౌస్ కీపింగ్ వాళ్లు కూడా విద్యార్థులు గదిలో ఉన్నప్పుడే వెళ్తారని అలాంటప్పుడు వారు రూమ్‌ క్లీన్‌ చేసిన యాసిడ్‌ను బకెట్‌లో ఉంచే అవకాశం లేదన్నారు.

ఏం జరిగిందనేది పోలీసులు అధికారికంగా నిర్ధారిస్తారని గణేశ్ తెలిపారు. అటు యూనివర్సిటీ డైరక్టర్‌ సైతం విద్యార్థినిపై యాసిడ్ దాడి అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. బాధిత విద్యార్థినితో పాటు మరో ముగ్గురు విద్యార్థులు కలిసి హాస్టల్ రూమ్‌లో ఉంటున్నారని, అయితే ఆ ముగ్గురికి పరీక్షలు అయిపోవడంతో వాళ్లు వారి ఇళ్లకు వెళ్లారని ప్రస్తుతం బాధిత విద్యార్థిని మాత్రమే ఉంటుందని తెలిపారు.

15వ తేదీ సాయంత్రం ఆ విద్యార్థిని రూమ్ తాళాలు తీసుకుని లోపలికి వెళ్లిందని, స్నానానికి వెళ్లినప్పుడు వేడి నీళ్ల వల్ల ఆమెకు శరీరం పైన బొబ్బలు వచ్చాయని తెలిపారు. స్నానం చేసిన తరువాత యువతి సెక్యూరిటీ గార్డ్ వద్దకు వచ్చి తనకు ఒంటిపై బొబ్బలు వస్తున్నాయని చెప్పిందని తెలిపారు. వెంటనే సెక్యూరిటీ గార్డ్ అంబులెన్స్‌కు కాల్ చేశారని, అయితే అంబులెన్స్ వచ్చే లోపల యువతి నడుచుకుంటూ యూనివర్సిటీ క్లినిక్ వెళ్లిందని పేర్కొన్నారు. అక్కడ ఆమెకు చికిత్స చేశారని పేర్కొన్నారు.

కాగా.. తాను సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇవన్నీ చెప్తున్నట్లు వెల్లడించారు. పోలీసులు కూడా సీసీ పుటేజ్‌ను చూసిన తర్వాత ఆమెపై ఎలాంటి యాసిడ్ దాడి జరుగలేదని అభిప్రాయానికి వచ్చారని పేర్కొన్నారు. ఇలా యాసిడ్ ఘటన ఏదైనా జరిగి ఉంటే దాచి పెట్టాల్సిన అవసరం తమకు లేదని తెలిపారు. కాగా ఈ సంఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.