TELANGANA ASSEMBLY | అసెంబ్లీలో వీడియోపై కేటీఆర్‌తో మంత్రుల వాగ్వివాదం

: అసెంబ్లీలో వీడియోతో సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారంపై కేటీఆర్ వర్సెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్‌, డి.శ్రీధర్‌బాబుల మధ్య అసెంబ్లీలో వాగ్వివాదం సాగింది.

TELANGANA ASSEMBLY | అసెంబ్లీలో వీడియోపై కేటీఆర్‌తో మంత్రుల వాగ్వివాదం

విధాత, హైదరాబాద్ : అసెంబ్లీలో వీడియోతో సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారంపై కేటీఆర్ వర్సెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్‌, డి.శ్రీధర్‌బాబుల మధ్య అసెంబ్లీలో వాగ్వివాదం సాగింది. సివిల్ కోర్టుల సవరణ బిల్లు అంశంపై చర్చ సందర్భం కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి ఏంటో చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే చట్టాలు తేవడం మంచిదికాదన్నారు. మంత్రి పొన్నం జోక్యం చేసుకుంటూ రాష్ట్రంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు అతిగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. మహిళా మంత్రిపైనా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఫేక్ వీడియోలు పెడుతున్నారని మండిపడ్డారు. సభా కార్యక్రమాలకు సంబందించి తన వీడియోతో సోషల్ మీడియాలో అభ్యంతరకర ప్రచారం చేస్ుతన్నారని, అసెంబ్లీలో నిబంధనలకు విరుద్దంగా వీడియోలు తీసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ సభలో తమ సభ్యులు ఎవరూ వీడియోలు తీయలేదన్నారు. అసెంబ్లీలోని కెమెరాలన్నీ స్పీకర్ ఆధీనంలోనే ఉంటాయన్నారు. మీరు మొత్తం చెక్ చేసుకోవ‌చ్చు. ఏ ర‌కంగా జ‌రిగిందో విచారించి చ‌ట్ట‌ప‌రంగా చర్య‌లు తీసుకోవ‌చ్చు సామాజిక మాధ్యమాల్లో ప్రధాని, సీఎంల వరకు కూడా వ్యక్తిత్వ హననం జరుగుతోందని, కించపరిచే వీడియోలు పెడుతున్నారన్నారు. నెహ్రూ పాల‌న నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రుగుతూనే ఉన్నాయని, అంద‌రం బాధితుల‌మే అని కేటీఆర్ తెలిపారు. శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మంత్రులు, ఇతరులపై జరుగుతున్న దుష్ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీలో, ప్రాంగణంలో వీడియోలు తీసి దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తప్పవన్నారు. సత్వర న్యాయం దిశగా 30ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నడుస్తున్నాయని, ఇంకా అవసరమైతే ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్త చట్టాలపై విశ్లేషణ జరుగుతుందన్నారు. సెబైర్ క్రైమ్ నియంత్రణకు కొత్త చట్టాలను తీసుకొస్తామన్నారు. నేరాలు, శాంతిభద్రతలకు సంబంధించి కఠినంగా వ్యవహారిస్తామన్నారు. సివిల్ కోర్టుల సవరణ బిల్లు చర్చలో బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావులు మాట్లాడారు. ప్రజా సంఘాల ధర్నాలలో, అసెంబ్లీ ముందు ధర్నాలపై పోలీసుల అతిగా వ్యవహారించకుండా చూడాలని కూనంనేని కోరారు.