Justice Sudarshan Reddy : భావప్రకటన స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం నిలవదు

భావప్రకటన స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం నిలవదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛ ప్రజల హక్కు అన్నారు.

Justice Sudarshan Reddy : భావప్రకటన స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం నిలవదు

విధాత, హైదరాబాద్ నవంబర్ 08(విధాత): భావప్రకటన స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం నిలవదని భారత సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు. ‘విశాలాంధ్ర మాజీ సంపాదకులు సి.రాఘవచారికి భయమనే పదం తెలియదు. సత్యం పట్ల ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కు తగ్గకుండా ‘విశాలాంధ్ర’ను నిలబెట్టారు. విశాలాంధ్రను కేవలం పత్రికగా కాకుండా, ఒక విలువల వేదికగా నిలబెట్టిన మహానుభావుడు రాఘవాచారి’ అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి కొనియడారు. అటువంటి మహనీయుని స్మారకోపన్యాసంలో పాల్గొనడం నాకు అదృష్టం’ అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. సి.రాఘవాచారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్ట్, విశాలాంధ్ర పూర్వ సంపాదకులు సి.రాఘవచారి 6వ స్మారకోపన్యాసం సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో శనివారం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ‘ప్రసార మాధ్యమాలు – న్యాయ వ్యవస్థ’ అనే అంశంపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రసంగిస్తూ మూడు దశాబ్దాల పాటు సంపాదకుడిగా రాఘవాచారి పనిచేశారన్నారు. ఐదు వేల రూపాయలతోనే జీవనం సాగిస్తూ, రిక్షాలలో ప్రయాణం కొనసాగించేవారని గుర్తు చేసుకున్నారు. సంపాదన లేని సంపాదకుడు రాఘవాచారి అని అన్నారు. ఇది డబ్బు కంటే విలువ, నిబద్ధత, సత్యం పట్ల ఆయనకున్న అంకితభావానికి నిదర్శనం అని అన్నారు.

భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూలాధారం..

పత్రికలు, యాజమాన్యాలు, సంపాదకులకు అవినాభావ సంబంధం కలిగిన అంశాలు అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణలు తీసుకురావాలని ప్రయత్నించినా, పత్రికల స్వేచ్ఛను ప్రజలు, కోర్టులు కాపాడాయన్నారు. ఆర్టికల్ 19(1)కు సవరణ ద్వారా నెహ్రూ ప్రభుత్వం సహేతుక నియంత్రణకు ప్రయత్నించిందని తెలిపారు. పత్రికల స్వేచ్ఛను కోర్టులు ఎల్లప్పుడూ కాపాడాయని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు. ‘భావ ప్రకటన స్వేచ్ఛ లేకుంటే ప్రజాస్వామ్యం ఉండదు’, ఇది కేవలం న్యాయసూత్రం కాదు, జీవనసత్యం అని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూలాధారమన్నారు. దాన్ని పూర్తిగా నియంత్రిస్తే ప్రజాస్వామ్యం సారం హీనమవుతుందన్నారు. సర్క్యులేషన్ తగ్గించడానికి ఆంక్షలు విధించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను సుప్రీం కోర్టు తిరస్కరించిందని తెలిపారు. భావప్రకటనా స్వేచ్ఛ మానవ హక్కుల అంతర్భాగమని జాన్ మిల్టన్ కూడా చెప్పారని అన్నారు.

సోషల్ మీడియాను నియంత్రిస్తున్న సంపన్నులు

సోషల్ మీడియా ఇప్పుడు మీడియా చేతుల్లో లేదని సుదర్శన్రెడ్డి అన్నారు. ప్రపంచంలోని కొద్దిమంది సంపన్నులు సోషల్ మీడియాను నియంత్రిస్తున్నారన్నారు. దీన్ని ఎంతవరకు నియంత్రించవచ్చన్నదే ఇప్పుడు ముంబాయి హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీం కోర్టులో చర్చ జరుగుతుందని చెప్పారు. రాఘవాచారి స్మారకోపన్యాసం ఇచ్చేందుకు నోట్ రాసుకొని వద్దామనుకున్నానని, కానీ సమయాభావం వల్ల రాయలేకపోయానని తెలిపారు. ఆయన నోట్స్ తీసుకొని చదివిన సందర్భం లేదని, ఆయనలాగే నేరుగా వచ్చి, హృదయం చెబుతున్న మాటలతోనే మాట్లాడాలని భావించానని తెలిపారు. రాఘవాచారి జీవితం మనందరికీ ఒక పాఠం అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు.

ప్రజల పక్షాన పనిచేసేందుకే మీడియాను రాజ్యాంగంలో చేర్చలేదు : కె. శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగంలో మీడియా ప్రస్తావన ఎక్కడ లేదనే విషయం తెల్సిందేనని అన్నారు. రాజ్యాంగంలో మీడియా ప్రస్తావనను డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వ్యతిరేకించారని తెలిపారు. మూడు అంగాలు రాజ్యాంగం పరిధిలో ఉన్నందున, రాజ్యాంగంలో మీడియాను బంధించొద్దని అంబేడ్కర్ చెప్పారన్నారు. ప్రజల పక్షాన మీడియా పనిచేయాలని అంబేడ్కర్ ఆకాంక్షించారని తెలిపారు. రమేష్ థాపర్ కేసులో ఆర్టికల్ 19 (1) ఎ లో పత్రికాస్వేచ్ఛ అంతర్భాగమని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. దేశంలో చోటు చేసుకున్న పరిణామాలు, అందరి భావాలు మీడియా చెప్పుతుందన్నారు. ఎన్ని ఆవరోధాలు వచ్చినా న్యాయ వ్యవస్థ రక్షించిందని పేర్కొన్నారు.