తుంగతుర్తి కాంగ్రెస్ వర్గపోరుపై పీసీసీకి జగ్గారెడ్డి నివేదిక

తుంగతుర్తి కాంగ్రెస్ వర్గపోరుపై జగ్గారెడ్డి తొమ్మిది పేజీల నివేదికను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యేనే నియోజకవర్గంలో తొలి ప్రాధాన్య నేత అని స్పష్టం చేశారు.

తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గ్రూప్ తగాదాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మంగళవారం టీపీసీసీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్ కు నివేదిక అందజేశారు. తొమ్మిది పేజీలతో జగ్గారెడ్డి తన నివేదికను సమర్పించారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంపై స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ కు, స్థానిక భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి వర్గాలకు మధ్య వివాదం రాజుకుంది. ఇరువర్గాలు పరస్పరం హైకమాండ్ కు ఫిర్యాదులతో పాటు రోడ్లపైన బాహాబాహికి దిగాయి. ఈ వివాదంపై విచారణకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

జగ్గారెడ్డి ఈ వివాదంలో ఎమ్మెల్యే మందుల సామేల్ తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ చామల, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలతో చర్చించి ఓ నివేదికను తయారు చేశారు. ఆ నివేదికను మహేశ్ కుమార్ గౌడ్ కు సమర్పించారు. నివేదికపై జగ్గారెడ్డి స్పందిస్తూ ..పార్టీ నేతల మధ్య సమన్వయం సాధించే దిశలోనే నివేదిక సమర్పించినట్లుగా తెలిపారు. ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ ఓ నియోజకవర్గం నేతలు కాదని..వారు రాష్ట్ర స్థాయి నాయకులు అని పేర్కొన్నారు. పార్టీ ప్రోటోకాల్, ప్రాధాన్యతల మేరకు ‘ఏ నియోజకవర్గానికైనా స్థానిక ఎమ్మెల్యేనే ఫస్ట్ బాస్ అని అన్నారు. ఆ తర్వాతే ఎంపీ, మంత్రులు వస్తారని పేర్కొన్నారు. మూడో ప్రాధాన్యత కార్యకర్తల పక్షాన డీసీసీ అధ్యక్షుడికి ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు.

Latest News