Jangaon Journalists Protest | సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పై దాడిని ఖండిస్తూ జనగామ జర్నలిస్టుల నిరసన

సాక్షి సంపాదకుడు ధనంజయ్‌రెడ్డిపై ఏపీ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా జనగామలో జర్నలిస్టులు నిరసన ర్యాలీ నిర్వహించారు.

  • By: TAAZ |    telangana |    Published on : Oct 17, 2025 8:48 PM IST
Jangaon Journalists Protest | సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పై దాడిని ఖండిస్తూ జనగామ జర్నలిస్టుల నిరసన

జనగామ, అక్టోబర్ 17 (విధాత):

Jangaon Journalists Protest | మీడియా స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తే ఎవరనేది చూడకుండా రాష్ట్రం రావణకాష్టంగా మారుస్తామని ఏపీ ప్రభుత్వానికి జనగామ జర్నలిస్టులు హెచ్చరిక చేశారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి పై జరుగుతున్న దాడిని ఖండిస్తూ జనగామ జర్నలిస్టులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి మీడియా పై జరుగుతున్న దాడులను తిప్పికొట్టే సమయం వచ్చిందని జర్నలిస్టులు స్పష్టం చేశారు. సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతి పాత్రికేయుడు ధైర్యంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్‌ ధనుంజయ రెడ్డి పట్ల ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ పాత్రికేయులు నినాదాలతో ఆందోళన వ్యక్తం చేశారు. ఐజేయూ జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి, రాష్ట్ర ప్రతినిధి వెంకటస్వామి, సీనియర్ జర్నలిస్టు కన్నా పరుశరాములు మాట్లాడుతూ.. ‘నకిలీ మద్యం, అవినీతి, ప్రజా సమస్యలపై వాస్తవాలను వెలుగులోకి తెస్తూ సాక్షి దినపత్రిక ప్రతిరోజూ ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తిస్తోంది. ఇలాంటి ధైర్యవంతమైన జర్నలిజాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కుట్రపూర్వకంగా కేసులు నమోదు చేస్తోంది. ఇది కేవలం ఒక పత్రికపై దాడి కాదు. మీడియా స్వేచ్ఛపై దాడి’ అని అన్నారు. సాక్షిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఏపీ ప్రభుత్వం ఒత్తిడికి లోనై పనిచేస్తున్న పోలీసుల తీరును వ్యతిరేకించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ వైఫల్యాలను దాచిపెట్టేందుకే పాత్రికేయులను భయాందోళనకు గురిచేస్తుందని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.

ప్రజల ప్రయోజనాల కోసం జర్నలిస్టులు నిజాన్ని వెలుగులోకి తెచ్చే క్రమంలో కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు.
నిరసనలో జిల్లా జర్నలిస్టుల సంఘం ప్రతినిధులు, ఎలక్ట్రానిక్‌ మీడియా పాత్రికేయులు, రిపోర్టర్లు, ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐజేయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిగెల బిక్షపతి, శేషాద్రి, జమాల్ షరీఫ్, అశోక్ కుమార్, లక్ష్మణ్, ఎండబట్ల భాస్కర్, హింజ మాధవరావు, శేషత్వం ఆనంద్ కుమార్, వంగ శ్రీకాంత్ రెడ్డి, కొత్తపల్లి కిరణ్ కుమార్, కాసాని ఉపేందర్, బండి శ్రీనివాస్ రెడ్డి, చౌదర్పల్లి ఉపేందర్, శివశంకర్, తిప్పారాపు ఉపేందరు, భాను, రమేశ్, భాస్కర్, కేమెడీ ఉపేందర్, ఓరుగంటి సంతోష్, గణేష్, మనీ, వినయ్, యూసుఫ్, కిషోర్, నేతి ఉపేందర్, గోవర్ధనం వేణు గోపాల్, మోహన్, మనీ, మధు, సలీం, సురేష్, ఆశిష్, సుధాకర్, నరేష్, జయపాల్ రెడ్డి, శంకర్, బాబా , రాజు, సుప్రీం జితేందర్ శ్రీను, ఏజాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.