విధాత : జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని సైతం సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఆయనకు ఫోన్ చేసిన సైబర్ నేరస్థుడు.. రూ.లక్ష కొట్టేశాడు. ఈ నెల 5న హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డికి ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి.. తాను ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ అంటూ పరిచయం చేసుకున్నాడు. ఓ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యేకు చెప్పాడు. దీనికిగాను ఒక్కొక్కరికి రూ.2500 చెల్లించాలని నమ్మబలికాడు.
తన నియోజకవర్గంలోని యువతకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సదరు అపరిచిత వ్యక్తికి ఎమ్మెల్యే పల్లా.. రూ.లక్ష ఫోన్ పే చేశారు. ఆ తర్వాత ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీకి ఫోన్ చేసి డబ్బులు వచ్చాయా? అని ఆరా తీశారు. తనకు ఎలాంటి డబ్బులు రాలేదని ఆయన సమాధానం చెప్పడంతోపాటు అసలు తాను ఫోన్ చేయలేదని స్పష్టం చేశాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన ఎమ్మెల్యే పల్లా.. జూబ్లీహిల్స్ పీఎస్ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి :
మహభారత యుద్దంగా మార్చారు ?..విడాకుల కేసుపై సుప్రీంకోర్టు అసహనం!
Samantha | తృటిలో తప్పించుకున్నా… లేదంటే సావిత్రిలా అయ్యేదాన్ని: సమంత సంచలన వ్యాఖ్యలు వైరల్
