సింగరేణి డిపెండెంట్ ఎంప్లాయ్‌మెంట్ సమస్యపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేదంటే ఈ నెల 20 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతాం అని తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాసే ప్రభుత్వానికి,ఏఐటియుసీ (AITUC), ఐఎన్టీయూసీ (INTUC) సంఘాలకు రోజులు దగ్గరపడ్డాయని కవిత హెచ్చరించారు. కవిత సత్తుపల్లి జేవీఆర్ ఓసీపీ సందర్శనను పోలీసులు అడ్డుకున్నారు. అయితే గేట్లు తోసుకుని కవిత,మద్దతుదారులు లోనికి వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో తన కార్యక్రమాన్ని అడ్డుకుందన్నారు. హెచ్ఎంఎస్ వస్తుందంటేనే మిగతా సంఘాలకు, పార్టీలకు భయం పుడుతుందని, వచ్చే గుర్తింపు సంఘాల ఎన్నికల్లో తప్పకుండా హెచ్ఎంఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని కవిత స్పష్టం చేశారు.
హెచ్ఎంఎస్ సంఘాన్ని అడ్డుకున్న సింగరేణి జనరల్ మేనేజర్ పై లేబర్ కోర్టులో న్యాయపోరాటం చేస్తుందని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం పనిచేయాల్సిన కమ్యూనిస్టు కార్మిక సంఘాలు ప్రభుత్వానికి, యాజమాన్యాలకు తోకలుగా మారాయని కవిత విమర్శించారు. మెడికల్ బిల్లులను కార్మికుల వేతనాల నుంచి నేరుగా కోతలు పెట్టే విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వం మేం డిమాండ్ చేస్తున్న మేరకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, డిపెండెంట్ ఎంప్లాయ్ మెంట్ దరఖాస్తుదారులకు న్యాయం చేయాలని లేదంటే తమ ఉద్యమాన్ని ఉదృతం చేస్తున్నామన్నారు. ఇల్లెందు,గుండాల, మణుగురు గనుల మాదిరిగా సత్తుపల్లి గనులను, కార్మికులను అన్యాయం చేయవద్దన్నారు. కార్మికులకు ఇవ్వాల్సిన 7శాతం హెచ్ఆర్ఏ ఇప్పించి, కార్మికుల కుటుంబాలకు దక్కాల్సిన వైద్య, విద్య, ఉద్యోగ ప్రయోజనాలను అందించాలని డిమాండ్ చేశారు.
