Kavitha : జనాభిప్రాయం కోసమే..జనం బాట
కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై జనాభిప్రాయం తెలుసుకునేందుకు ఈ నెల 25 నుంచి 4 నెలల పాటు 33 జిల్లాల్లో 'జనం బాట' యాత్రను నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ప్రజలు కోరుకుంటే తప్పకుండా పార్టీ పెడతానని దాని వల్ల ప్రజలకు మేలు జరగాలని ఆమె అన్నారు.

విధాత : కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై జనాభిప్రాయం తెలుసుకునేందుకే ఈ నెల 25 నుంచి 4 నెలల పాటు ‘జనం బాట’ యాత్రను నిర్వహిస్తున్నట్లుగా తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, బీఆర్ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
ప్రజలు కోరుకుంటే తప్పకుండా రాజకీయ పార్టీ పెడతానని..పార్టీ పెడితే నాకు కాదు ప్రజలకు మేలు జరగాలని ఆమె అన్నారు. గురువారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘జనం బాట’ కార్యక్రమానికి లక్ష్మీ నరసింహాస్వామి ఆశీస్సుల కోసమే వచ్చామని, మొన్న తిరుపతి, ఇప్పుడు యాదగిరి గుట్ట దేవాలయాలను దర్శించుకున్నాం అని తెలిపారు. ‘జనం బాట’ కార్యక్రమానికి ఎలాంటి అవాంతారాలు రాకుండా చూడాలని స్వామి వారిని కోరుకున్నాం అని, ప్రజా సమస్యలను అర్థం చేసుకునే శక్తి ఇవ్వాలనే దైవ దర్శనం చేసుకుంటున్నాం అని కవిత చెప్పుకొచ్చారు.
ఈ నెల 25 నుంచి మా సొంత ఊరు నిజామాబాద్ నుంచి ‘జనం బాట’ కార్యక్రమం మొదలవుతుందని, 33 జిల్లాల్లో 4 నెలలు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఉండి అక్కడి సమస్యలు తెలుసుకుంటాం అని కవిత వెల్లడించారు. మేధావులు, విద్యావంతులు, రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాలను కలుస్తాం అన్నారు. వారు చెప్పే సమస్యలను అర్థం చేసుకొని…వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలన్న దానిపై దృష్టి పెడతాం అని, ప్రజలతో కూలంకషంగా మాట్లాడేందుకు జాగృతికి ఈ కార్యక్రమం వేదికగా మారనుందని తెలిపారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర సాధన ఉద్యమం సమయం నుంచి కూడా రాజకీయ, ప్రజాసమస్యలపై మాట్లాడుతుందన్నారు. రాజకీయాలు మాట్లాడాలంటే రాజకీయ పార్టీగానే ఉండాల్సిన అవసరం లేదు అని, పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తాం. అందులో ఇబ్బందేమీ లేదు అని కవిత పేర్కొన్నారు. ఏపీలో మూడు, తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని… కేరళలో గల్లీకి ఒక పార్టీ ఉంది అని, పార్టీలు ఉండటం పెద్ద విషయం కాదు. వాటి వల్ల ప్రజలకు మేలు జరగాలి అన్నారు. నేను పార్టీ పెడితే నాకు లాభం కాదు. ప్రజలకు మేలు జరిగేందుకు ప్రయత్నిస్తానని కవిత తెలిపారు.
తెలంగాణ వచ్చాక కేసీఆర్ యాదగిరి గుట్టను చక్కగా పునర్నిర్మించారని కవిత గుర్తు చేశారు. యాదాద్రి ప్రాశ్యస్తాన్ని కాపాడే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, మేము వస్తుంటే విచిత్రమైన హోర్డింగ్ లను చూశాం అని, అలా కాకుండా తిరుమలలో మాదిరిగా స్వామి వారి హోర్డింగ్ లు, చిత్రపటాలే ఇక్కడ ఉండేలా చూడాలన్నారు. మళ్లీ యాదాద్రికి వస్తానని, అప్పుడు ఇక్కడున్న అన్ని సమస్యలపై వివరంగా మాట్లాడతానన్నారు.