ఉద్యమ చరిత్రను రూపుమాపేందుకే బతుకమ్మ లేని తెలంగాణ తల్లి : కవిత ధ్వజం

బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం కాదని కవిత విమర్శించారు. ఉద్యమ చరిత్రను చెరిపివేయాలనే ప్రయత్నమేనని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఉద్యమ చరిత్రను రూపుమాపేందుకే బతుకమ్మ లేని తెలంగాణ తల్లి : కవిత ధ్వజం

విధాత : తెలంగాణ శాసన సభ ప్రాంగణంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో ఆవిష్కరించబడిన బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ఉద్యమ చరిత్రను రూపుమాపాలన్న సీఎం రేవంత్ రెడ్డి అల్పసంతోషానికి నిదర్శనమే తప్ప తెలంగాణ సంస్కృతికి, ఆత్మకు ప్రతిరూపం కాదు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. బతుకమ్మ లేని తెలంగాణ తల్లి ఎంత మాత్రమూ తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం కాదు. బతుకమ్మ సమస్త తెలంగాణ సంస్కృతికి ప్రతీక. ఆనాడు తమ మూలాలు మదిన తలుస్తూ బిడ్డలంతా కూడి తల్లికి రూపమిచ్చిన అపురూప సందర్బం అది అని కవిత అభిప్రాయపడ్డారు. రాష్ట్రోద్యమ కాలంలో ఏర్పరచుకున్న తల్లి రూపురేఖలు మార్చడం ఉద్యమ గుర్తులను చెరిపేసే దుస్సాహసం. బతుకమ్మతో కూడిన తెలంగాణ తల్లి ఉద్యమ త్యాగాలకు, స్మృతులకు సజీవ దృశ్య రూపం అని వ్యాఖ్యానించారు.

చరిత్ర నిర్మాణంలో పాల్గొనని వారు మొదట చేయాలనుకునే పని చరిత్రను చెరిపేయాలని చూడడం అని.. కుదరకపోతే వక్రీకరించాలని చూడడం అని కవిత అన్నారు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనులు ఇవేనని విమర్శించారు. నేడు తెలంగాణలో నూటికి 90 మందికి రేవంత్ రెడ్డి కన్నా గొప్ప తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉందని, తనకు స్థానం లేని ఉద్యమ చరిత్రను రూపుమాపాలి అనే అల్పసంతోషంతోనే బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ముందుకు తెచ్చారని కవిత విమర్శించారు. అమరుల త్యాగాలను ఒడిసి పట్టుకున్న నాటి ఉద్యమ తెలంగాణ తల్లిని మేము మళ్ళీ ఒకరోజు ఇదేచోట ప్రతిష్టించడం ఖాయం అని కవిత పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ అలజడి !
సినిమా వాళ్లు…ఎమ్మెల్యేలు అంతా డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలి : ఎమ్మల్యే అనిరుధ్ రెడ్డి