కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ అలజడి !

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య డిన్నర్ మీటింగ్ నిర్వహించారన్న వార్తలు పార్టీలో అలజడి రేపాయి. మంత్రి పదవుల అంశం తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ అలజడి !

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికి కూడా ఆశించిన పదవులు, ప్రాధాన్యతలు దక్కని కాంగ్రెస్ నాయకుల్లో క్రమంగా అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. అసమ్మతి స్వరాన్ని వినిపించడంలో ముందున్న కాంగ్రెస్ నాయకులలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి, ఇబ్రహీమ్ పట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిలు ప్రముఖంగా ఉన్నారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ప్రాధాన్యతనిచ్చి సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న తనను పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో ఉన్న జీవన రెడ్డి ఈ నెల 25న పార్టీకి గుడ్ బై కొట్టి బీఆర్ఎస్ లో చేరబోతున్నారన్న సమాచారం కాంగ్రెస్ లోని అసమ్మతికి హైప్ తీసుకొచ్చింది. ఆయనను బుజ్జగించి.. పార్టీ మారకుండా చూడాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ రంగంలోకి దించారు. అయితే ఇప్పటికే జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై నిర్ణయం తీసేసుకున్నారని..త్వరలో కారు పార్టీలోకి చేరబోతున్నారని అనుచర వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

అలజడి రేపిన రాజగోపాల్ రెడ్డి సిక్రెట్ మీటింగ్

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి కోసం రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా 15మంది పార్టీ ఎమ్మెల్యేలతో రహస్య డిన్నర్ మీటింగ్ నిర్వహించారన్న సమాచారం పార్టీలో అలజడి రేపింది. అయితే సిక్రెట్ మీటింగ్ కు మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైనట్లుగా పార్టీ వర్గాల కథనం. ఓ వైపు సీనియర్ నేత జీవన్ రెడ్డి తిరుగుబాటు కలకలం రేపుతుండగానే..రాజగోపాల్ రెడ్డి సిక్రెట్ మీటింగ్ పార్టీ నాయకత్వానికి మరింత అలజడి రగిలించినట్లయ్యింది.

ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి రాబోయే రోజులలో నాకు మంత్రి పదవి వస్తుంది అని.. మంత్రి పదవి రాకపోతే నా టార్గెట్ సీఎం పదవే అని ప్రకటించి కలకలం రేపారు. నాకు అడుక్కోవడం రాదు అని, లాక్కోవడమే నా సిద్ధాంతం అంటూ పరోక్షంగా తన రాజకీయ వ్యూహాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డి నిర్వహించిన ఎమ్మెల్యేల సిక్రెట్ భేటీ.. తదుపరి పరిణామాలపై ఉత్కంఠ పెరుగుతోంది.

ఒత్తిడి పెంచేందుకేనా ?

రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు ఇద్దరు కూడా మంత్రి పదవులపై గట్టి ఆశలు పెట్టుకున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సామాజిక సమీకరణల కూర్పు సాకుతో తమను మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదన్న అసంతృప్తి వారిలో నెలకొంది. మంత్రి పదవి సాధించే క్రమంలో పలుమార్లు సందర్బం మేరకు పొగడ్తలు, విమర్శలు చేసినా ఫలితం లేకుండా పోతుంది. దీంతో పార్టీలో తన బలాన్ని చూపేందుకు రాజగోపాల్ రెడ్డి తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో సిక్రెట్ మీటింగ్ లతో రేవంత్ రెడ్డిపైన..పార్టీ నాయకత్వంపైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి, మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2025 జూన్‌లో వాకిటి శ్రీహరి (బీసీ ముదిరాజ్‌), గడ్డం వివేక్‌ (ఎస్సీ మాల), అడ్లూరి లక్ష్మణ్‌ (ఎస్సీ మాదిగ)లను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక సందర్భంలో మైనార్టీ కోటాలో మాజీ క్రికెటర్ అజారుద్ధీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో మైనార్టీ వర్గానికి మంత్రి పదవి దక్కలేదన్న చర్చకు ఫుల్ స్టాప్ పడింది. అజార్ చేరికతో సీఎంతో కలిపి మంత్రుల సంఖ్య 16కు చేరింది. అయినప్పటికి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటి కోసం రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా పలువరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేసులో ఉన్నారు.

భట్టిపై ఎమ్మెల్యేల అసహనం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసేందుకు వెళ్లిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవమానం ఎదురైనట్లుగా వెలువడిన వార్తలు పార్టీలో మరింత వేడి పుట్టించాయి. భట్టి ఛాంబర్ లోకి వెళ్ళేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలు మందుల సామెల్, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయ రమణారావు లను గన్ మెన్స్ అడ్డుకోవడం వారిని అసహానానికి గురి చేసింది. తమను సీఎం ఛాంబర్ ముందు కూడా ఇలా ఆపరని అసంతృప్తికి గురైన ఎమ్మెల్యేలు…కోపంతో భట్టిని కలువకుండనే వెళ్ళిపోయిన ఘటన పార్టీలో చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి :

Consanguineous Marriage : మేనరికం పెళ్లిళ్లతో సమస్యలు నిజమేనా?
కాంగ్రెస్ భవిష్యత్తుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు