KCR : బీఆర్ఎస్ ఎల్పీ కీలక భేటీ 21న..హాజరుకానున్న కేసీఆర్

ఈ నెల 21న బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ కీలక భేటీ జరగనుంది. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ హాజరుకానుండగా, నీటి హక్కుల పోరాటం మరియు జడ్పీటీసీ ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు.

KCR : బీఆర్ఎస్ ఎల్పీ కీలక భేటీ 21న..హాజరుకానున్న కేసీఆర్

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ శాసన సభ పక్ష సమావేశం, పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గం విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 21న నిర్వహించనున్నారు. సుధీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారని సమాచారం. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ సాధించిన ఫలితాలతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది. ఇదే ఉత్సాహంతో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఎదుర్కోవాలని గులాబీ నాయకత్వం భావిస్తుంది. బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాల్లో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్షతో పాటు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే పార్టీలో నెలకొన్న అంతర్గత పరిణామాలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా చర్చ జరుగవచ్చన్న టాక్ వినిపిస్తుంది.

ఏపీ జల దోపిడీపై పోరుబాట..మహాబూబ్ నగర్ లో సభ

బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఏపీ జలదోపిడీపైన, పెండింగ్ ప్రాజెక్టులపైన చర్చించి భవిష్యత్తు పోరాట కార్యాచరణ నిర్ణయించనున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి కొత్తగా కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని చేపట్టడాన్ని బీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తున్నది. అలాగే ఏపీ పోలవరం నల్లమల ప్రాజెక్టును సైతం బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహాబూబ్ నగర్ జిల్లాలోనే భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ పోరాటానికి శంఖారావం పూరించాలని బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. నదుల అనుసంధానం పేరిట ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపైనా ఉద్యమించాలని బీఆర్ఎస్ తలపోస్తున్నది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందీళ్ల, అన్నారం బరాజ్ ల మరమ్మతులపై కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ వ్యూహారచన చేస్తుండటం ఆసక్తికరం.

ఇవి కూడా చదవండి :

Diamond Rain | అక్కడ వజ్రాల వానలు! తెచ్చుకోవడం సాధ్యమేనా?
BRS MLAs Disqualification Petition: ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్