U19 MCWC : IND vs NZ | అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్ ఘనవిజయం

అండర్-19 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అంబరీశ్‌ 4 వికెట్లు, కెప్టెన్ అయుష్‌ మాత్రే అర్ధసెంచరీతో జట్టు విజయానికి మార్గం సుగమం చేశారు.

  • By: ADHARVA |    sports |    Published on : Jan 24, 2026 9:35 PM IST
U19 MCWC : IND vs NZ | అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్ ఘనవిజయం

India vs New Zealand U19 World Cup: Ambrish, Mhatre Power India to Big Win

విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​:

  • బంతితో అంబరీశ్‌ మెరుపులు బ్యాట్​తో మాత్రే పిడుగులు

U19 MCWC : IND vs NZ | అండర్-19 వరల్డ్‌కప్ గ్రూప్ దశలో భారత్ మరో అద్భుత విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచిన భారత్, గ్రూప్-బీలో అజేయంగా అగ్ర స్థానంలో నిలిచింది.

అంబరీశ్​ ధాటికి కుదేలైన కివీస్​

టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆర్సీ అంబరీశ్‌, హెనిల్ పటేల్ అద్భుత ఆరంభం ఇచ్చారు. పవర్‌ప్లేలోనే హ్యూగో బోగ్‌, ఆర్యన్ మన్ వికెట్లను పడగొట్టి న్యూజిలాండ్‌ను 17/3తో కష్టాల్లోకి నెట్టారు. వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడడంతో ఇన్నింగ్స్‌ను 37 ఓవర్లకు కుదించారు. అయినప్పటికీ కివీస్ కోలుకోలేకపోయారు. క్రమంగా 22/5, 69/7గా కుప్పకూలిన న్యూజిలాండ్‌ను కాలమ్ శాంసన్‌ (37*) – సెల్విన్ సంజయ్‌(28)ల 53 పరుగుల భాగస్వామ్యం కాస్త నిలబెట్టింది. అయితే చివర్లో అంబరీశ్‌ మరోసారి మెరిపించి మొత్తం 4 వికెట్లు తీసి ప్రత్యర్థిని 135 పరుగులకే కట్టడి చేశాడు.

బ్యాటింగ్‌లో చెలరేగిన మాత్రే

136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలో ఆరోన్ జార్జ్ వికెట్ కోల్పోయినా, ఆ తర్వాత అయుష్‌ మాత్రే – వైభవ్ సూర్యవంశీ జోడీ మ్యాచ్‌ను పూర్తిగా మలుపుతిప్పింది. కేవలం 6.3 ఓవర్లలోనే ఈ జంట 76 పరుగులు జోడించి గెలుపు దిశగా భారత్‌ను నడిపించింది. సూర్యవంశీ 23 బంతుల్లో 40 పరుగులు (2 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ మాత్రే బాధ్యత తీసుకుని చెలరేగిపోయాడు. 24 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసి, 6 సిక్సర్లు, 2 ఫోర్లతో మ్యాచ్‌ను ముగించాడు. చివర్లో వేదాంత్ త్రివేది విజయపరుగులు కొట్టి భారత్‌కు గెలుపు అందించాడు.

ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో అంబరీశ్‌ (4/29), బ్యాటింగ్‌లో మాత్రే (53) ప్రధాన హీరోలుగా నిలిచారు. ఈ విజయం ద్వారా భారత్ వరుసగా మూడో గెలుపు సాధించి, గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచింది.