Kishan Reddy : భయంతోనే ముఖ్యమంత్రి సోయి తప్పి మాట్లాడుతున్నాడు
కాంగ్రెస్ ఓటమి భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి సోయి తప్పి మాట్లాడుతున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
హైదరాబాద్, నవంబర్ 08 (విధాత): కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోయి తప్పి మాట్లాడుతున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్లేటప్పుడు, తాను ఏమి చేశాడో వివరించి, ఆ తర్వాత ప్రత్యర్థిని విమర్శిస్తూ ఓట్లు అడగాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన హామీలు ఏమాత్రం ఉన్నాయో ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క హామీని కూడా అమలు చేయకుండా, ప్రత్యర్థిపై విమర్శలు మాత్రమే చేస్తున్నాడు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మళ్లించే వ్యూహంలో భాగంగానే మాపై, మా ప్రధానమంత్రిపై, మా పార్టీపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసిపోయాయని దిగజారుడు రాజకీయాలు రేవంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రచారమే చేశారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ నాపై వ్యక్తిగత విమర్శలు చేశాడు. నన్ను వ్యక్తిగతంగా విమర్శించినా, తప్పుడు ఆరోపణలు చేసినా, నా వ్యక్తిత్వాన్ని విమర్శించినా, ప్రజలు దానిని విశ్వసించలేదన్నారు.
బీజేపీ అంటే ఏమిటో, కిషన్ రెడ్డి అంటే ఏమిటో దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలుసు. మీలాగా మాది కుటుంబ పార్టీ కాదు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పార్టీ బీజేపీ. మోదీ గారి నాయకత్వంలో ఒక్క చిన్న అవినీతి ఆరోపణ కూడా లేకుండా పనిచేస్తున్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఫేక్ వీడియోలు తయారు చేసి ప్రచారం చేసిన పార్టీ కాంగ్రెస్-బీఆర్‌ఎస్. జూబ్లీహిల్స్‌లో కూడా అదే పరిస్థితి. లక్ష కోట్ల అవినీతి డబ్బులు కక్కిస్తానన్న రాహుల్ గాంధీ లక్ష రూపాయలను కూడా బయటకు తీశాడా? అని ప్రశ్నించారు.
ఢిల్లీ స్థాయిలో బీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇది వాస్తవం కాదా? కేటీఆర్ నిన్న కాక మొన్న మాట్లాడుతూ, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని తప్పించాలనుకున్నాడు అని ప్రచారం చేసింది నిజం కాదా? ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు… కేటీఆర్ సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, కేజ్రీవాల్‌ను కలుపుకొని పోరాటం చేయాలన్నది నిజం కాదా? మరి ఏ విధంగా బీజేపీకి, బీఆర్‌ఎస్‌కు సంబంధం అంటగడుతున్నారని మండిపడ్డారు. చీము నెత్తురు ఉంటే, దమ్ము దైర్యం ఉంటే, ఏ విషయంలో బీజేపీ-బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయో చూపించాల్సిందిగా సవాల్ చేస్తున్నాను. నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం కాదని ధ్వజమెత్తారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది? ధాన్యం కొనుగోళ్ల కేసు ఏమైంది? భూముల కొనుగోళ్ల కేసు ఏమైంది? ఒక్క బీఆర్‌ఎస్ నేతలపై చర్యలు తీసుకున్నావా, రేవంత్ రెడ్డీ? ప్రచారంలో బీఆర్‌ఎస్‌పై ఎన్ని ఆరోపణలు చేశావో మర్చిపోయావా, రేవంత్ రెడ్డీ అని ప్రశ్నించారు.
అసలు నీ మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉందా? మీ పార్టీలో నీ మీద నీకు నమ్మకం ఉందా? మీ మంత్రులు నిన్ను నమ్ముతున్నారా? మీ మంత్రులు ఏ మాట్లాడుకుంటున్నారో వింటున్నావా? వాళ్లు కార్యకర్తలతో ఏం చెబుతున్నారో నీకు తెలుసా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram