మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్..భట్టితో మురళీ భేటీ !

కొండా సురేఖ వివాదం నేపథ్యంలో కొండా మురళీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ కావడం తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తి రేపింది. రాజకీయాలపై చర్చించలేదని మురళీ స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల క్రమంలో మంత్రి కొండా సురేఖకు పదవీ గండం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని ఇప్పటికే కొండా సురేఖ వివరణ ఇవ్వగా..క్రమశిక్షణా కమిటీ మాత్రం ఆమెను పదవి నుంచి తొలగించాలని సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా…బుధవారం కొండా మురళీ ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలవడం ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామంగా నిలిచింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి కొండా మురళి ప్రజాభవన్ లో భట్టితో భేటీ కావడం ఆసక్తి రేపింది. అధిష్టానం కొండా కుటుంబంపై సీరియస్‌గా ఉండటంతో కొండా మురళి రాయబారం మొదలుపెట్టినట్లుగా భావిస్తున్నారు. ఈ సమావేశానికి రాజగోపాల్ రెడ్డి హాజరుకావడం…అదే సమయంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రజాభవన్ కు వచ్చి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

భట్టితో భేటీ అనంతరం కొండా మురళీ మాట్లాడుతూ..ఓ బిల్లు విషయంలో భట్టిని కలిశానని, రాజకీయాల గురించి ఏం మాట్లాడలేదు అని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ పై సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించే హక్కు మాకు లేదని, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయన్నారు. బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు రాలేదా? నా బిడ్డకు స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది అని, సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని, నా కూతురు వ్యాఖ్యల వివాదంతో నాకు సంబంధం లేదని అని చెప్పారు. ఇప్పటికే క్రమశిక్షణా కమిటీకి చెప్పాల్సింది చెప్పాం అని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే దాకా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని అన్నారు.

ప్లాన్ ఏలో తను చెప్పాలనుకుంది చెప్పింది అని, ప్లాన్ బీలో ఏం చేస్తుందో నా బిడ్డకు తెలుసు.. నాకేం తెలుసు అని, నేను మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతానని తెలిపారు. గాంధీ కుటుంబంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అని కొండా మురళి అన్నారు.

Latest News