విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపైన కూతురు కొండా సుస్మిత చేసిన వివాదస్పద వ్యాఖ్యల క్రమంలో మంత్రి కొండా సురేఖపై వేటు వేయాలని, టికెట్ అమ్ముకున్నారంటూ వ్యాఖ్యలు చేసిన సీనియర్ నాయకులు చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని పీసీసీ క్రమశిక్షణా కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బీ.మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవిలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వారంతా ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లో సమావేశం కానున్నారు. కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై చర్యల అంశంపై వారంతా కేసీ వేణుగోపాల్ తో చర్చించబోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కూడా కొండా, చిన్నారెడ్డిల వివాదంపై హైకమాండ్ కు ఓ నివేదిక ఇవ్వనున్నారు.
ఢిల్లీ వెళ్లిన కొండా సురేఖ
తనపై క్రమశిక్షణా చర్యలు కోరుకుంటున్న వారంతా ఢిల్లీ హైకమాండ్ ను కలుస్తున్న నేపథ్యంలో కొండా సురేఖ కూడా తన వాదన వినిపించేందుకు కేసీ వేణుగోపాల్ అపాట్మెంట్ కోరారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆయన నుంచి సందేశం రావడంతో కొండా సురేఖ కూడా ఢిల్లీ వెళ్లారు. కొండా సురేఖ వెళ్లిన విమానంలోనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ లు కూడా ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరం. అలాగే ఇదే రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనుండటంతో కాంగ్రెస్ లో, ప్రభుత్వంలో కీలక పరిణామాలు ఏవో జరుగబోతున్నాయన్న ప్రచారం ఊపందుకుంది.
ఆశావహుల ఢిల్లీ బాట..
మరోవైపు కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ప్రచారం నేపథ్యంలో మంత్రిపదవులను ఆశిస్తున్న నేతలు కూడా ఒక్కొక్కరుగా ఢిల్లీ బాటపట్టారు. ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ తనకు మంత్రి పదవి కావాలంటూ మల్లిఖార్జున్ ఖర్గేను కలిసి అభ్యర్థించారు. పీసీసీ చీఫ్ బీ.మహేశ్ కుమార్ గౌడ్ కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తుండటం ఆసక్తికరం. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జి.సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్ వంటి కీలక నేతలు కూడా తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
