సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆదేశించారు. లేదంటే..మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సి వస్తుందని ఖర్గే పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ రాగానే గవర్నర్ కు బర్తరఫ్ లేఖ అందిస్తారని మల్లిఖార్జున్ ఖర్గే స్పష్టం చేసినట్లుగా సమాచారం.
మంత్రి పదవికి నేడు కొండా రాజీనామా ?
తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయనున్నారన్న సంకేతాల నేపథ్యంలో కొండా సురేఖ నేడు మధ్యాహ్నంకల్లా తన పదవికి రాజీనామా చేయవచ్చన్న ప్రచారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ వర్గాలలో బలంగా వినిపిస్తుంది. మధ్యాహ్నం హైదరాబాద్ లో కొండా సురేఖ మురళి దంపతులు మీడియా సమావేశంలో తన నిర్ణయం ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది. ఢిల్లీ నుంచి వచ్చిన కొండా సురేఖ గురువారం తన అనుచరులతో భేటీ అయ్యారు. తన ఢిల్లీ పర్యటన వివరాలను అనుచరులకు వివరించారు. అధిష్ఠానానికి అన్ని విషయాలు చెప్పానని, వారి నుంచి పదవిపై భరోసా దక్కలేదని వెల్లడించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో బర్తరఫ్ గురై అవమానపడే కంటే..మంత్రి పదవికి రాజీనామా చేయాలని కొండా సురేఖ నిర్ణయించుకున్నారని అనుచర వర్గాలు చెబుతున్నాయి. అయితే మంత్రి పదవితో పాటు పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా సురేఖ రాజీనామా చేస్తారా లేదా అన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సురేఖ రాజీనామా తర్వాతా మరింత వేడెక్కనున్న కాంగ్రెస్ రాజకీయాలు
మంత్రి పదవి నుంచి తప్పించడం ఖాయమని తేలిపోవడంతో కొండా దంపతులు తదుపరి అడుగులు వేస్తున్నారు. పార్టీ వేటు వేయకముందే పదవికి రాజీనామా చేసి హుందాగా భవిష్యత్ కార్యాచరణ దిశగా సాగాలని కొండా సురేఖ మురళి దంపతుల ఆలోచనగా తెలుస్తుంది. ఇప్పటికే నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నాపై ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించిన మంత్రి సురేఖ..చర్యలు తీసుకోవాలనుకుంటే పదేళ్లు సీఎంగా ఉంటానని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డిపైన, హైకమాండ్ ను కాదని తనే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ప్రకటిస్తున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేనొక బీసీ వర్గం పద్మశాలి, నాభర్త ఒక మున్నూరు కాపు తెలంగాణలో మా సామాజిక వర్గం ఓట్లు 16% ఓట్లు ఉంటాయని ఆమె ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు.
అంతేకాదు పార్టీ క్రమశిక్షణ చర్యలు నా వంటి బీసీలకు ఓరకంగా, ఇతర సామాజిక వర్గాల మంత్రుల పట్ల మరోరకంగా ఎందుకు ఉంటున్నాయంటూ కొండా సురేఖ హైకమాండ్ ను ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి దోపిడీ, ఆయన కొడుకు కబ్జాలను, భట్టి విక్రమార్క భార్య కమిషన్ల వసూళ్లపై కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని రూ.50 కోట్లకు కొనుక్కున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో ఆరోపించారని, వారందరిపై లేని క్రమశిక్షణచర్యలు నాపైనే ఎందుకు? అని ఆమె ప్రశ్నించారు. అసలు రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థులను ముందే ప్రకటించే హక్కు ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడేవారిపై చర్యలు తీసుకోవాలంటే ముందుగా రేవంత్‌రెడ్డి నుంచే మొదలుపెట్టాలి’’ అని సురేఖ అన్నారు. మంత్రిగా ఉన్న నాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేలపై ఎందుకు షోకాజ్ నోటీసులు, చర్యలు లేవని నిలదీశారు. వారి వెనక ఉండి నడిపించిన వాళ్లపైన కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు.
నేను ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా నా శాఖను నేను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని, అలాంటి నాపై కూతురు వ్యాఖ్యల నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమంటూ సురేఖ ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ మహిళలు స్వతంత్రంగా ఎదుగాలని, మహిళా రిజర్వేషన్లు, సాధికారిత గురించి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ అధికారింలో ఉన్న కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లలో కర్ణాటకలో మహిళా మంత్రి లేరని, తెలంగాణలో మహిళ మంత్రిగా ఉన్న నన్ను ఎందుకు కేబినెట్ నుంచి తప్పిస్తారంటూ కొండా సురేఖ ప్రశ్నించారు. జగ్గారెడ్డి అంటే రేవంత్‌కి భయమని, అందుకే కార్పోరేషన్ల పదవుల వ్యవహారంలో మిగతా వారికి భిన్నంగా ఆయన భార్యను మళ్లీ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో కొనసాగిస్తున్నారని సురేఖ గుర్తు చేశారు.
నేను ఏ తప్పు చేశానో చెబితే సమాధానం చెబుతానని, నా కూతురికి కొన్ని భావాలు, ఆశయాలు ఉంటాయని, తనూ ఎమ్మెల్యే కావాలనుకుంటోందని సురేఖ వివరించారు. నాకంటే పార్టీలోకి ఆలస్యంగా వచ్చిన కడియం శ్రీహరి బిడ్డను వేరే పార్టీ నుంచి తీసుకొచ్చి ఎంపీని చేశారు కదా అని, మరి మీరేం చేస్తున్నారని మా బిడ్డ ప్రశ్నిస్తే మేము ఏమని సమాధానం చెప్పాలి? అని సురేఖ వ్యాఖ్యానించారు. మీరు బీసీలకు కనీసం చైర్మన్ పదవి కూడా తెచ్చుకోలేనప్పుడు.. ఇక నన్ను ఎమ్మెల్యేను ఎలా చేస్తారని నా కూతురు నిలదీస్తోందని, అందుకే స్వతంత్రంగా ఆమె నిర్ణయాలు ఆమె తీసుకుంటుందన్నారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవని సురేఖ హెచ్చరించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు పలు ప్రశ్నలు సంధించిన కొండా సురేఖ ఈ రోజు మీడియా సమావేశంలో మరిన్ని ఇబ్బందికర ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని తెలుస్తుంది. కొండా కుటుంబం తమ ‘ప్లాన్ బి’ ఏమిటన్నది మీడియా సమావేశంలో వెల్లడిస్తారా? అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది.
