KTR| టెక్స్టైల్ పార్కులో కాంగ్రెస్ రూ.160 కోట్ల దోపిడీ

కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కాలువ పనుల్లో రూ. 160 కోట్లు దండుకునేందుకు కాంగ్రెస్ దండుపాళ్యం బ్యాచ్ సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణ చేశారు

KTR| టెక్స్టైల్ పార్కులో కాంగ్రెస్ రూ.160 కోట్ల దోపిడీ
  • దండుకుంటున్న దండుపాళ్యం బ్యాచ్
  • మంత్రులు, ఎమ్మెల్యేల జేబుల్లోకి డబ్బులు
  • కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి

విధాత, వరంగల్ ప్రతినిధి: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కాలువ పనుల్లో రూ. 160 కోట్లు దండుకునేందుకు కాంగ్రెస్ దండుపాళ్యం బ్యాచ్ సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణ చేశారు. వీరిని ప్రశ్నించకుంటే దోపిడిని కొనసాగిస్తారని, శాసనసభలో రేవంత్ను గల్లాపట్టి అడుగుతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల, భూపాలపల్లిలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పరకాలలో నిర్వహించిన సమావేశంలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేసీఆర్ కిట్లు, కుట్టు మిషన్ లు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ టెక్స్టైల్ పార్కులో రూ. 137 కోట్లతో జనవరినెలలో టెండర్‌ను పిలిచారు… అదే నెల 24న ఒప్పందం కుదిరింది…. అయితే, మార్చి 22 వచ్చేసరికి చేసుకున్న ఆ ఒప్పందాన్ని రద్దు చేసి, అదే కాల్వ పనిని మళ్లీ రూ.297 కోట్లకు టెండర్‌కు పిలిచారు… ఈ మూడు నెలల్లో తట్టెడుమట్టి తీయకుండా, ఒక్క ఇటుక పేర్చకుండా అంచనా వ్యయం ఏకంగా రూ.160 కోట్లు ఎలా పెరిగిందంటూ నిలదీశారు. కాలువ పనుల పేరిట కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రూ.160 కోట్ల ప్రజాధనాన్ని దోచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఇచ్చిన హామీలు అమలుచేయనందున నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు ఎగవేస్తున్నారన్నారు. ఆడబిడ్డలకు రూ.2500 ఇవ్వనందున ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ.50 వేలబాకీపడ్డదన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.3వేల కోట్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం రూ.300 కోట్లు ఇచ్చి సంబరాలు చేసుకోమంటున్నదని విమర్శించారు. సమ్మక్క- సారక్క, రాణి రుద్రమ వారసురాళ్లయిన వరంగల్ ఆడబిడ్డలు కాంగ్రెస్ నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టాలని అన్నారు. రైతుబంధును తాము నాట్లప్పుడు వేస్తే ఈ ప్రభుత్వం ఓట్లప్పుడు వేస్తుందన్నారు. ఎన్నికలప్పుడు రైతుబంధువేసి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయని మళ్లీ వేశారని విమర్శించారు. ఎన్నికల్లో గులాబీ కండువా కప్పుకుని వచ్చే బీఆర్ఎస్ కార్యకర్తను కేసీఆరే వచ్చిండని భావించి కడుపులో పెట్టుకొని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో మళ్ళీ ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టాల్సివస్తుందని టైంకు ఎరువులు, విత్తనాలు ఇవ్వలేని ముఖ్యమంత్రికి పదవిలో ఉండే అర్హత లేదన్నారు.

కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తానని రేవంత్ రెడ్డి ప్రగల్బాలు పలుకుతున్నాడన్నారు. గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు నిర్మించుకున్న 3 వేల మంది లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సతాయిస్తున్నదని ఇందిరమ్మ, సోనియమ్మ, ప్రియాంకనో ఏ పథకం కింద ఇవ్వాలని ఎద్దేవా చేశారు. కుట్టు శిక్షణ పొందుతున్న ఆడబిడ్డలకు కాకతీయ టెక్స్ టైల్ పార్కులో ఉద్యోగాలు వచ్చే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు ఉపాధి కోసం మడికొండలో 100 ఎకరాల్లో ఏర్పాటుచేసిన షెడ్లు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో నిరుపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటలాడుతున్న అధికారులకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. దామాషా ప్రకారం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సీట్లు ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్బండా ప్రకాష్, శాననమండలి పక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పోచంపల్లి, మాజీ ఎమ్మెల్యేలు వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ధర్మారెడ్డి, రాజయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.