Mid-Day Meals | విద్యార్థులకు అన్నం పెట్టలేని స్థితిలో ప్రభుత్వం : కేటీఆర్, హరీష్ రావు విమర్శలు

Mid-Day Meals | విద్యార్థులకు అన్నం పెట్టలేని స్థితిలో ప్రభుత్వం : కేటీఆర్, హరీష్ రావు విమర్శలు

Mid-Day Meals | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మద్యాహ్న భోజనం పథకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పాఠశాల విద్యార్థులకు నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. మిస్ వరల్డ్ పేరిట లక్ష రూపాయలకు ఒక ప్లేటు చొప్పున భోజనం పెట్టిన ప్రభుత్వం పేద విద్యార్థులకు కనీసం అన్నం కూడా పెట్టడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు వేములవాడ దేవాలయాన్ని సందర్శించినప్పుడు హైదరాబాద్ నుంచి 32 వేల రూపాయలకు ప్లేటు చొప్పున భోజనం తెప్పించుకుని తిన్నారని.. పేద విద్యార్థులకు కారం, నీళ్ల సాంబార్‌తో భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవిష్యత్తు అయిన విద్యార్థులకు నీళ్ల సాంబార్ భోజనం పెట్టడమే ప్రజా పాలనలో సాధించిన విజయమా? అని ప్రశ్నించారు. ఇప్పటిదాకా 90 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రికి కనీసం వారి మరణాలను గుర్తించే సమయం కూడా లేదు అని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను కనీసం మనుషులుగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించదా? అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన భోజనం అందించడం కూడా చేతకాదా? అని కేటీఆర్ విమర్శించారు.

విద్యార్థులకు కడుపునిండా అన్నం పెట్టలేని సీఎం విజన్ 2047 గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. 20 నెలల పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా అందించలేని దుస్థితికి ఈ ప్రభుత్వం చేరుకున్నదని ఫైర్ అయ్యారు. మూడు నెలలుగా భోజన బిల్లులు చెల్లించకపోవడం వల్ల, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గొడ్డుకారం, నీళ్ల సాంబారే భావి భారత పౌరులకు భోజనం అయిందన్నారు. మెనూ ప్రకారం పోషకాలతో కూడిన భోజనం అందించవలసి ఉన్నప్పటికీ ప్రభుత్వ అలసత్వం వల్ల ఎక్కడా అమలుకావడం లేదన్నారు. ‘తనిఖీలు చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే దుస్థితి ఉన్నప్పటికీ పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తానని కోతలు కోసే రేవంత్ రెడ్డీ.. కనీసం విద్యార్థులకు ఒకపూట అన్నం పెట్టే పరిస్థితిలో కూడా లేవా?. ఇంటిగ్రేటెడ్ స్కూలు, స్కిల్ యూనివర్సిటీ అని మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు మాత్రం గడప కూడా దాటని పరిస్థితి. నీ నిర్లక్ష్యంతో ఒకవైపు గురుకులాల ఖ్యాతిని దిగజార్చావు.. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పోగొడుతున్నావు. విద్యాశాఖ నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన మంత్రి లేడా. ఇంకెన్నాళ్లు మంత్రి లేని అనాథగా విద్యాశాఖ ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ డ్రాపవుట్స్ తగ్గించేందుకు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకానికి తూట్లు పొడిచి మళ్ళీ విద్యార్థులను చదువుకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నావా రేవంత్ రెడ్డి. ఢిల్లీ ట్రిప్పులు, రాజకీయాలు, కక్ష సాధింపు చర్యలు, పొలిటికల్ డైవర్షన్లు బందు పెట్టి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించండి. విద్యాశాఖపై సమీక్ష చేయండి. మధ్యాహ్న భోజన బిల్లులను వెంటనే విడుదల చేయండి’ అని హరీష్ రావు పేర్కొన్నారు.