KTR | రాజకీయాలకు అతీతంగా గురుకుల మరణాలపై స్పందించాలి.. ప్రభుత్వానికి కేటీఆర్ హితవు
గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల మరణాల పట్ల ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా స్పందించి మరణాల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులకు గర్భశోకం మిగల్చొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితవు పలికారు

విధాత, హైదరాబాద్ : గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల మరణాల పట్ల ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా స్పందించి మరణాల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులకు గర్భశోకం మిగల్చొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితవు పలికారు. ఇటీవల పెద్దపూర్ గురుకుల పాఠశాలలో పాముకాటుకు గురై మృతి చెందిన విద్యార్థి అనిరుధ్ కుటుంబ సభ్యులను సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అనిరుధ్ అనే చిన్నారి మరణం ఆ తల్లితండ్రులతో పాటు ప్రతి ఒక్కరిని తీవ్రంగా బాధిస్తోందన్నారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించి రాజకీయాలు వద్దని.. మన అందరికీ కుటుంబాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడకుండా ఆ విద్యార్థులకు మంచి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కుటుంబ సభ్యులను కోల్పోతే ఎంత బాధ ఉంటదో అర్థం చేసుకోగలమన్నారు. ఈ 8 నెలల కాలంలో 36 మంది గురుకుల విద్యార్థులు మృత్యువాత పడ్డారన్నారు. కొందరు విషాహారం తిని, మరికొందరు పాముకాట్ల కారణంగా, ఇంకొందరు విద్యార్థులు అనుమానాస్పదంగా చనిపోవటం బాధాకరమన్నారు. 500 వందల పిల్లలు విషాహారం తిని హాస్పిటల్‌లో పాలైన పరిస్థితి వచ్చిందన్నారు. పిల్లలు బాగుండాలి, వారు ప్రపంచంతో పోటీపడే విధంగా చదువుకోవాలని మనం వెయ్యికిపైగా గురుకులాలు పెట్టుకున్నామన్నారు. వాటిని ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలుగా కూడా అప్‌గ్రేడ్ చేసుకున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వం సంక్షేమ పాఠశాలు, సంక్షేమ వసతుల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే తల్లితండ్రి మాదిరిగా బాధ్యత తీసుకోవాలన్నారు.