జానారెడ్డికి కూడా కోరిక‌లు పుట్టాయి.. మంత్రి కేటీఆర్ సెటైర్లు..

జానారెడ్డికి కూడా కోరిక‌లు పుట్టాయి.. మంత్రి కేటీఆర్ సెటైర్లు..

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి జానారెడ్డిపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని జానారెడ్డికి కూడా సీఎం ప‌ద‌విపై కోరిక‌లు పుట్టాయ‌ని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైద‌రాబాద్ జ‌ల‌విహార్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయ‌వాదుల స‌మ్మేళ‌నంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

కాంగ్రెస్ పార్టీకి 11 మంది ముఖ్య‌మంత్రులు దొరికారు.. కానీ ఓట‌ర్లు దొరుకుత‌లేరు.. అయితే జానారెడ్డికి కూడా కోరిక‌లు పుట్టాయి. విచిత్రం ఏందంటే జ‌నారెడ్డి ఎన్నిక‌ల్లో కూడా పోటీ చేస్త‌లేరు. ఈ మ‌ధ్య‌న బ‌లగం సినిమా వ‌చ్చింది. అందులో ఓ పెద్ద మ‌నిషి ఉంట‌డు. తాత‌ ల‌గ్గం చేసుకుంటావా అని అంటే.. పెళ్లి చేసుకోను అన‌డు.. నాకెవ‌డు పిల్ల‌ను ఇస్త‌డురా అంట‌డు. జానారెడ్డి క‌థ కూడా అట్ల‌నే ఉంది. ఎల‌క్ష‌న్ల‌లో పోటీ చేయ‌డంట కానీ.. ప‌ద‌వులు మాత్రం వెతుక్కుంటూ వ‌స్తాయ‌ట‌. ఇంత‌కంటే పెద్ద సిపాయి మ‌న‌కు లేడు. జానారెడ్డి ఒక్క‌డే ఉన్నాడు.. ఇక ప‌ద‌వులు వెతుక్కుంటూ వ‌స్త‌యంట‌. వాళ్ల‌కు కావాల్సింది ప‌ద‌వులు, పైస‌లు. మళ్లా అర్జెంట్‌గా తెలంగాణ‌లో జొర్రాలి. మొత్తం ప‌దేండ్లు అధికారం మిస్ అయ్యారు.. ఇక ఇప్పుడు తెలంగాణ ప్ర‌జ‌ల ర‌క్తాలు పీల్చుకోవాలి అది వారి ఎజెండా అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్న క‌ర్ణాట‌క‌లో ఏమైతుందో చూడండి. ముఖ్య‌మంత్రి సిద్ధరామ‌య్య‌, డిప్యూటీ ముఖ్య‌మంత్రి శివ‌కుమార్ మ‌ధ్య సంధి క‌దుర్చిరారు. ఇక ఇప్పుడు మూడో కృష్ణుడు మోపైండు. ఖ‌ర్గే కుమారుడు కూడా నేను కూడా సీఎం రేసులో ఉన్నాన‌ని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇక మూడు క్యాంపులు.. ఫైవ్ స్టార్ హాట‌ల్స్, బ‌స్సులు.. 24 గంట‌లు టీవీల్లో చ‌ర్చ‌లు. 6 నెల‌ల‌కు ఒక‌సారి ముఖ్య‌మంత్రి మారుడు. రాజ‌కీయ అస్థిర‌త‌. ఇది వ‌ర‌కు చూసిందే అని కేటీఆర్ ఆగ్ర‌హం వెలిబుచ్చారు.

1991లో స్వ‌యంగా చెన్నారెడ్డి చెప్పారు. మా పార్టీ వారే న‌న్ను దించి ముఖ్య‌మంత్రి అయ్యేందుకు హైద‌రాబాద్‌లో మ‌త‌క‌ల్లోలాల పేరిట 400 మందిని చంపింది మా కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ని చెన్నారెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌కు ప్ర‌జ‌ల‌ మీద ప్రేమ లేదు. ప‌దవుల మీద మోజు త‌ప్ప‌.. ఉద్య‌మంలో క‌లిసి రాలేదు. ప‌ద‌వుల కోసం పెద‌వులు మూసుకున్నారు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.