KTR : కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్
కేటీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్‌ను కాంగ్రెస్-బీజేపీ జాయింట్ వెంచర్‌గా విమర్శిస్తూ, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ భవిష్యత్తు నిర్ణయిస్తుందని అన్నారు.

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ వంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అరచేతిలో వైకుంఠం చూపించి 420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ జైత్రయాత్రతో ప్రజలు సురుకు పెట్టాలని పిలుపునిచ్చారు. పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపిస్తే సంక్షేమ పథకాలు అమలు కావు అని హెచ్చరించారు. రాహుల్ గాంధీ ఓట్ చోర్ అంటున్న మోదీని, మోసగాడనే అదానీని రేవంత్ వెనుకేసుకొస్తున్నాడని, రాహుల్ బేకార్ అన్న గుజరాత్ మోడల్‌ను ప్రశంసించిన రేవంత్, వేటకుక్క అన్న సీబీఐని కేసీఆర్ మీదకే ప్రయోగించాడని కేటీఆర్ విమర్శించారు. దేశంలోని ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం చేసిన వక్ఫ్ సవరణలకు వ్యతిరేకంగా రాజ్యసభలో బీఆర్ఎస్ ఓటు వేసిందని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణలను దేశంలో అందరి కంటే ముందు రేవంత్ ప్రభుత్వమే అమలు చేసిందన్నారు. రాహుల్ నిత్యం విమర్శించే మోదీ, అదానీలను రేవంత్ వెనుకేసుకొస్తున్నాడని కేటీఆర్ తప్పుబట్టారు. ఇలా ఎందుకు చేస్తున్నాడో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ మంత్రులను, నేతలను ముస్లింలు నిలదీయాలని కేటీఆర్ కోరారు.
తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఉప ఎన్నిక
చరిత్రలో తొలిసారి ముస్లిం మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేకుండానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని కేటీఆర్ విమర్శించారు. రేపటి తెలంగాణ భవిష్యత్తును జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక డిసైడ్ చేస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కారు కావాలో కాంగ్రెస్, బీజేపీ బేకార్ గాల్లు కావాలో ప్రజలే తేల్చుకోవాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రక్షగా, గొంతుగా ఉన్న కేసీఆర్‌ను లేకుండా చేయాలన్నదే బీజేపీ, కాంగ్రెస్ ఉమ్మడి లక్ష్యం అని విమర్శించారు. బీఆర్ఎస్‌ని ఖతం చేస్తే కాంగ్రెస్‌ను ఈజీగా ఫుట్‌బాల్ ఆడుకోవచ్చని బీజేపీ భావిస్తుందన్నారు. రేవంత్ ప్రభుత్వం చేసిన మోసంతో రాష్ట్రంలో ఏ ఒక్క ఆడబిడ్డ సంతోషంగా లేదు.. గీతక్క, సీతక్క, సురేఖ అక్కలు మాత్రమే సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420హామీలలో భాగంగా కల్యాణ లక్ష్మి కింద కేసీఆర్ కేవలం లక్ష రూపాయలు ఇస్తున్నాడని.. మేం అధికారంలోకి వస్తే తులం బంగారం కూడా ఇస్తామని కాంగ్రెస్ నేతలు అబద్ధపు మాటలు చెప్పారని కేటీఆర్ విమర్శించారు. చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు. స్కూటీలు లేవు కానీ కాంగ్రెస్ నేతల లూటీ మాత్రం ఆగడం లేదన్నారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమే
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమేనని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లోని బస్తీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ తమ ఇంటిని కూలగొడుతుందో అని భయంతో బతుకుతున్నారన్నారు. తన ఇల్లు కూలగొడతారన్న భయంతో కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని, కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు ఏ రోజూ పేదోడి ఇంటిని కూలగొట్టలేదని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలాల్లో ఉన్న లక్ష మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారన్నారు. హైదరాబాద్‌లోని ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువుల ఇల్లు కడితే హైడ్రా బుల్డోజర్ పోదు అని… చెరువుల్లో ఇండ్లు కట్టుకున్న మంత్రుల జోలికి హైడ్రా పోదు అని.. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి సొంత ఇల్లు రెడ్డి కుంటలో ఉన్నదని కేటీఆర్ ఆరోపించారు. పక్క బస్తీలోకి వచ్చిన బుల్డోజర్ ఖచ్చితంగా రేపు మీ ఇంటి ముందు కూడా వస్తుంది. పేదవాడి కడుపు కొడుతున్న ఈ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధి చెప్పాలి అని కేటీఆర్ కోరారు.
మాగంటి సునీతమ్మను గెలిపించాలి
రాష్ట్రమంతా ఒక తీరుగా ప్రజలు తీర్పునిస్తే హైదరాబాదులో మాత్రం బీఆర్ఎస్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని విశ్వనగరంగా మార్చిన బీఆర్ఎస్‌ను అన్ని స్థానాల్లో గెలిపించారని, ప్రత్యర్థులు ఎంత దుష్ప్రచారం చేసినా జూబ్లీహిల్స్‌లో మూడోసారి మాగంటి గోపీనాథ్‌ను గెలిపించారన్నారు. మాగంటి గోపీనాథ్ సేవల్ని కొనసాగిస్తామని ఆయన సతీమణి సునీతమ్మ మీ ముందుకు వచ్చింది. అందరూ ఆమెను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.