విద్యను నిర్లక్ష్యం చేస్తున్న పార్టీలను నిలదీయండి: ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ
ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేసి, విద్యా కార్పొరేటీకరణకు అండగా నిలవడంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కనిపిస్తుందని తెలంగాణ

– విద్యారంగ పీపుల్స్ మేనిఫెస్టో విడుదల
– పార్టీలన్నీ మేనిఫెస్టోలో చేర్చాలి
విధాత, వరంగల్ ప్రతినిధి: ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేసి, విద్యా కార్పొరేటీకరణకు అండగా నిలవడంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కనిపిస్తుందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొ. లక్ష్మీనారాయణ విమర్శించారు. నాణ్యమైన ఉచిత సమాన విద్య కోసం ఈ పార్టీలను నిలదీయాలని పిలుపునిచ్చారు. మానుకోట టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో విద్యారంగ సమస్యలపై రూపొందించిన పీపుల్స్ మేనిఫెస్టోను సోమవారం ఆయన విడుదల చేశారు. అనంతరం చుంచు శ్రీశైలం, భాస్కర్ ల అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో లక్ష్మీనారాయణ ప్రసంగించారు.
కేంద్ర ప్రభుత్వం సిలబస్ మార్చే సాకుతో చరిత్ర వక్రీకరణ దశను దాటిపోయి, మొత్తంగా చరిత్రనే మార్చేస్తుందని ఆరోపించారు. కొందరికే విద్య అనే నినాదం బీజేపీ సైద్ధాంతిక వాదమన్నారు. విద్య ద్వారా ప్రజల్లో వచ్చే చైతన్యం, తద్వారా మొలకెత్తే ప్రశ్నలంటే ఆ పార్టీకి భయమని అందుకే ఆశాస్త్రీయత, అవిద్య, అజ్ఞానం వైపు ప్రజలను నడిపిస్తుందని అన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న ఆ పార్టీ విధానం పైకి చెప్తున్నట్లు హిందు మత ఉద్దరణ లక్ష్యం కాదని, ఆ ముసుగులో దేశ వనరులను దోచుకోవడం, బడా వ్యాపారవేత్తలకు దోచిపెట్టడమేనని విమర్శించారు. వాలంటీర్లు, కౌన్సిలర్లు, ధార్మిక స్వచ్ఛంద సంస్థల పేర్లతో విద్యారంగంలోకి నేరుగా జొరబడి విద్యలో జ్యోతిష్యం, అభూత కల్పనలు వంటి తిరోగమన విధానాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దేశ భవిష్యత్తును నిర్మించే కీలకమైన విద్య పట్ల ఇతర రాజకీయ పార్టీల చిన్నచూపు సమాజం క్షమించరాని నేరం అవుతుందని హెచ్చరించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో విద్యారంగ మౌలిక అంశాలను చేర్చాలని డిమాండ్ చేశారు. ఆశాస్త్రీయ, అలౌకిక, చైతన్య రహత విద్యతో పాటు, ఆ విద్యను అందించజూస్తున్న పార్టీలను కూడా తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా నాయకులు బలాస్టి రమేష్, సోమ విష్ణువర్ధన్,చీకటి ఉపేందర్,డీటీఫ్ నాయకుడు ఎన్ .ఉపేందర్ రెడ్డి, టీపీటీఫ్ మహబూబాబాద్ మండల అధ్యక్ష,కార్యదర్శులు రాచకొండ ఉపేందర్, ఎస్ విద్యాసాగర్, నాయకులు ఏ గోవర్ధన్, కే వెంకటేశ్వర్లు, కోడెం శ్రీనివాస్,గోనె కార్తిక్,బి మోహన్, వి ఎం డి రఫిక్, జి మురళి,బి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
!!!!