George Reddy | జార్జ్‌ రెడ్డి స్ఫూర్తితో సమానత్వ సమాజాన్ని స్థాపించుకోవాలి

పీడీఎస్‌యూ వ్యవస్థాపకుడు, ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నేత, ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జ్‌రెడ్డి స్ఫూర్తితో కుల, మత, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వ సమాజాన్ని స్థాపించుకోవాలని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సీహెచ్ దినేశ్ కుమార్ పిలుపునిచ్చారు.

  • By: TAAZ    news    Apr 14, 2025 7:07 PM IST
George Reddy | జార్జ్‌ రెడ్డి స్ఫూర్తితో సమానత్వ సమాజాన్ని స్థాపించుకోవాలి
  • కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ సీహెచ్ దినేష్ కుమార్
  • జార్జ్‌రెడ్డి 53 ఏళ్ల అమరత్వాన్ని స్మరించుకుంటూ మార్నింగ్ వాక్

George Reddy | విధాత, వరంగల్: పీడీఎస్‌యూ వ్యవస్థాపకుడు, ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నేత, ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జ్‌రెడ్డి స్ఫూర్తితో కుల, మత, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వ సమాజాన్ని స్థాపించుకోవాలని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సీహెచ్ దినేశ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం కామ్రేడ్ జార్జ్‌ రెడ్డి 53 వర్ధంతిని స్మరించుకుంటూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు, జార్జ్‌రెడ్డి అభిమానులు, ప్రజాస్వామికవాదులు, పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థులంతా కలిసి “మార్నింగ్ వాక్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ దినేష్ కుమార్ కేయూ మొదటి గేటు వద్ద జెండా ఊపి ప్రారంభించగా పీడీఎస్‌యూ శ్రేణులు, విద్యార్థులంతా జార్జ్‌రెడ్డికి లాల్ సలాం, జీనా హై తో మర్నా సీఖో.. కదం కదం పర్ లడ్‌నా సీఖో, విద్య కాషాయీకరణ, ప్రైవేట్, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం, శాస్త్రీయ విద్యను సాధిద్దాం, దేశంలో మతోన్మాద ఫాసిజాన్ని ప్రతిఘటిద్దామంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం విద్యార్థులనుద్దేశించి సీహెచ్ దినేశ్‌ కుమార్, పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థి ఆస్నాల శ్రీనివాస్, వరంగల్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తీగల జీవన్ , నున్న అప్పారావు, ముల్క రవి, పీడీఎస్‌యూ రాష్ట్రనేతలు మొగిలి వెంకట్ రెడ్డి, బి.నరసింహరావు, ఈ విజయ్ ఖన్నా ప్రసంగించారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలని కోరారు. బీజేపీ మోదీ ప్రభుత్వ హయాంలో దేశంలో పెరిగిపోతున్న మతోన్మాద ఫాసిజాన్ని అడ్డుకోవాలంటే, ప్రగతిశీల ఉద్యమాలను, భావజాలాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కామ్రేడ్ జార్జ్‌ రెడ్డి భౌతికంగా దూరమై 53 ఏళ్లు గడిచినప్పటికీ నేడు వ్యవస్థ మార్పు కోసం జరుగుతున్న పోరాటాల్లో, విద్యార్థి ఉద్యమాల్లో నిత్యం స్ఫూర్తిదాయకంగా వెలుగొందుతున్నాడని తెలిపారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థులు సూత్రపు అనిల్, రూపేశ్‌, మైదం పాణిలతో పాటు పీడీఎస్‌యూ నాయకులు మిశ్రీన్ సుల్తానా, రాచకొండ రంజిత్, వినయ్, బీ బాలు, వీ కావ్య, వంశీ, అనూష, అర్జున్, ముషారఫ్, గణేష్, యాదగిరి, లోకేష్, పవన్ కళ్యాణ్ ,శంకర్, సంగీత, నాగరాజు, ప్రశాంత్, రాజ్ కుమార్ అక్షర, తదితరులు పాల్గొన్నారు.