Student Union Elections | 38 ఏళ్ల త‌ర్వాత‌.. తెలంగాణ యూనివ‌ర్సిటీల్లో స్టూడెంట్ యూనియ‌న్ ఎన్నిక‌లు..!

Student Union Elections | తెలంగాణ‌( Telangana )లోని అన్ని యూనివ‌ర్సిటీల్లోని( Universities ) విద్యార్థుల‌కు ఇది శుభ‌వార్తే. ఎందుకంటే దాదాపు 38 ఏండ్ల త‌ర్వాత విద్యార్థి సంఘాల‌కు ఎన్నిక‌లు( Student Union Elections )నిర్వ‌హించేందుకు తెలంగాణ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న్( Telangana Education Commission ) సిద్ధ‌మ‌వుతుంది.

  • By: raj |    telangana |    Published on : Nov 13, 2025 8:32 AM IST
Student Union Elections | 38 ఏళ్ల త‌ర్వాత‌.. తెలంగాణ యూనివ‌ర్సిటీల్లో స్టూడెంట్ యూనియ‌న్ ఎన్నిక‌లు..!

Student Union Elections | హైద‌రాబాద్ : తెలంగాణ‌( Telangana )లోని అన్ని యూనివ‌ర్సిటీల్లోని( Universities ) విద్యార్థుల‌కు ఇది శుభ‌వార్తే. ఎందుకంటే దాదాపు 38 ఏండ్ల త‌ర్వాత విద్యార్థి సంఘాల‌కు ఎన్నిక‌లు( Student Union Elections )నిర్వ‌హించేందుకు తెలంగాణ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న్( Telangana Education Commission ) సిద్ధ‌మ‌వుతుంది. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం ఉస్మానియా( Osmania University ), కాక‌తీయ యూనివ‌ర్సిటీ( Kakatiya University )తో పాటు అన్ని యూనివ‌ర్సిటీల్లో స్టూడెంట్స్ యూనియ‌న్ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. తెలంగాణ ఎడ్యుకేష‌న్ పాల‌సీలో ఈ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి నిపుణుల క‌మిటీ ప్ర‌తిపాద‌న చేసింది.

తెలంగాణ‌లోని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ( Hyderabad Central University ), ఇఫ్లూ యూనివ‌ర్సిటీ( EFLU ), మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఉర్దూ యూనివ‌ర్సిటీలో ప్ర‌తి ఏడాది విద్యార్థి సంఘాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌బడుతాయి. కానీ రాష్ట్ర యూనివ‌ర్సిటీల్లో చివ‌రిసారిగా 1988లో విద్యార్థి సంఘాల ఎన్నిక‌లు జ‌రిగాయి.

38 ఏళ్ల క్రితం.. ఏం జ‌రిగిందంటే..?

ఓ ఆంగ్ల మీడియా క‌థ‌నం ప్ర‌కారం.. 1988లో ఉస్మానియా యూనివ‌ర్సిటీ( Osmania University )లో నిర్వ‌హించిన విద్యార్థి సంఘాల ఎన్నిక‌లు హింసాత్మ‌కంగా మారాయి. నిజాం కాలేజీ( Nizam College )కి చెందిన స్టూడెంట్ లీడ‌ర్ దేవేంద‌ర్ యాద‌వ్( Devender Yadav ) నాటి ఎన్నిక‌ల సంద‌ర్భంగా హ‌త్య‌కు గుర‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌తో పాటు స్టూడెంట్ యూనియ‌న్ల ప్ర‌చారం సంద‌ర్భంగా ఉస్మానియా, కాక‌తీయ యూనివ‌ర్సిటీల్లో విద్యావేత్త‌ల‌కు అంత‌రాయం క‌లిగించిన ఘ‌ట‌న‌లు అనేకం. ఈ క్ర‌మంలో నాటి ఉమ్మ‌డి ఏపీ ప్ర‌భుత్వం.. తెలంగాణ ప‌రిధిలోని అన్ని యూనివ‌ర్సిటీల్లో స్టూడెంట్ యూనియ‌న్ ఎన్నిక‌ల‌పై నిషేధం విధించింది.

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత విద్యావ్య‌వ‌స్థ‌పై సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఓ నిపుణుల క‌మిటీని నియ‌మించారు. ఎడ్యుకేష‌న్ పాల‌సీ తీసుకొచ్చే క్ర‌మంలో ఉస్మానియా, కాక‌తీయ‌, తెలంగాణ‌ యూనివ‌ర్సిటీల్లోని దాదాపు 20 నుంచి 30 స్టూడెంట్ ఆర్గ‌నైజేష‌న్ నాయ‌కుల‌తో నిపుణుల క‌మిటీ స‌మావేశ‌మై చ‌ర్చించిన సంద‌ర్భంలో మ‌ళ్లీ విద్యార్థి సంఘాల ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. విద్యార్థి సంఘాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. త‌మ హ‌క్కుల కోసం ఉమ్మ‌డిగా ప్ర‌భుత్వంతో, యూనివ‌ర్సిటీల‌తో పోరాటం చేసే అవ‌కాశం ఉంటుంద‌న్న ప్ర‌తిపాద‌న వ‌చ్చింది.

ప్ర‌స్తుతం ప్ర‌తి యూనివ‌ర్సిటీలో ప‌దుల సంఖ్య‌లో స్టూడెంట్ ఆర్గ‌నైజేష‌న్లు ఉన్నాయి. ఈ సంఘాలు త‌రుచుగా యూనివ‌ర్సిటీల్లో ఆందోళ‌న‌లు నిర్వ‌హించ‌డం, ఒక‌రికి మించి మ‌రొక‌రు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డం.. యూనివ‌ర్సిటీ కార్య‌క‌లాపాల‌కు భంగం క‌ల‌గ‌డంతో పాటు ప్ర‌శాంతా వాతావ‌ర‌ణాన్ని దెబ్బ‌తీస్తున్నాయ‌ని ప‌లువురు విద్యార్థి సంఘాల నేత‌లు పేర్కొన్నారు.

తెలంగాణ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న్ మెంబ‌ర్ ప్రొఫెస‌ర్ పీఎల్ విశ్వేశ్వ‌ర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌తిపాదించాం. ఎందుకంటే ప్ర‌స్తుతం ప్ర‌తి యూనివ‌ర్సిటీలో ప‌దుల సంఖ్య‌లో విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల వ‌ల్ల విద్యార్థుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావు. అధికారికంగా ఎన్నిక‌లు నిర్వ‌హించి.. దాని ద్వారా ఎన్నికైన విద్యార్థి సంఘాలు యూనివ‌ర్సిటీల‌తో మాట్లాడి విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ఎక్కువ అవ‌కాశం ఉంటుంద‌న్నారు. అంతేకాకుండా ఎన్నికైన విద్యార్థి సంఘం.. యూనివ‌ర్సిటీ పాల‌న‌, విద్యా మండ‌లి స‌మావేశాల్లో పాల్గొని త‌మ స‌మ‌స్య‌ల‌ను లేవనెత్తేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. కాబ‌ట్టి రాష్ట్ర విశ్వ‌విద్యాల‌యాల్లో విద్యార్థి సంఘాల ఎన్నిక‌ల‌ను ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు ప్రొఫెస‌ర్ పీఎల్ విశ్వేశ్వ‌ర్ రావు పేర్కొన్నారు.

తెలంగాణ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న్ నిపుణుల క‌మిటీ ప్ర‌తిపాదన‌ను ప‌లు విద్యార్థి సంఘాలు స్వాగ‌తించాయి. ఈ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం వ‌ల్ల యూనివ‌ర్సిటీల నుంచి కొత్త నాయ‌క‌త్వం ఎదిగే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. విద్యార్థుల స‌మ‌స్య‌లు కూడా త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్కారం అయ్యే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు.