Crime News : కూకట్‌పల్లి బాలిక హత్య కేసు.. వీడిన మిస్టరీ
కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ వీడింది. పక్కింటి 10వ తరగతి విద్యార్థి నిందితుడిగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

Crime News | విధాత, హైదరాబాద్ : కూకట్ పల్లి సంగీత్‌నగర్‌లో బాలిక సహస్ర(10) హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించారు. నిందితుడు10వ తరగతి చదువుతున్న పక్కింటి అబ్బాయిగా గుర్తించి అతడిని అరెస్టు చేశారు. బాలుడు దొంగతనం కోసం వెళ్లాడని.. ఇంట్లో బాలిక ఉండటంతో హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడి ప్రవర్తన అత్యంత క్రూరంగా ఉండటం పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది. అతను ముందస్తుగా పక్కా ప్రణాళిక మేరకు ప్రొఫెషనల్ కిల్లర్ లాగా ప్లాన్ చేసి హత్య చేయడం అందరిని విస్మయపరిచింది. దొంగతనం ఎలా చేయాలి..? అడ్డొస్తే ఎలా తప్పించుకోవాలి..హుండీ ఎలా పగులగొట్టాలన్న అంశాలను ముందే పేపర్‌పై నిందితుడు రాసిపెట్టుకోవడం గమనార్హం.
హత్య జరిగిన తీరు…
నిందితుడు తను నివాసం ఉంటున్న పక్క బిల్డింగ్ లో దొంగతనం చేయాలని నిర్ణయించుకుని ఈ నెల 18న తన ఇంటి నుంచి పక్కింటికి గోడల మీదుగా వెళ్లాడు. అప్పటికే బాలిక తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లిపోగా…ఏడేళ్ల తమ్ముడు ఇంటికి సమీపంలోని బడికి వెళ్లాడు. బాలిక సహస్ర బోయిన్‌పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. అయితే ఆ రోజు క్రీడోత్సవాల నేపథ్యంలో పాఠశాలకు సెలవు ఇవ్వడంతో బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. ఇంట్లోకి ఎవరు లేరనుకుని ఆ ఇంట్లో దొంగతనానికి వచ్చిన నిందితుడు ఇంట్లోని దేవుని గదిలోని హుండీ పగలగొట్టి రూ.80 వేలు చోరీ చేశాడు. ఇది చూసిన సహస్ర తన తల్లిదండ్రులకు చెబుతానని చెప్పడంతో ఆమెను క్రూరంగా హత్య చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేసి గొంతులో పొడిచాడు. కిందపడిపోయిన ఆమె చనిపోయిందో లేదోనన్న అనుమానంతో ఆమెపై కూర్చొని గొంతు నులిమి, విచ్చలవిడిగా 20చోట్ల పొడిచాడు. గొంతు కోశాడు. ఆ తర్వాత పక్క బిల్డింగ్‌లో 15 నిమిషాలు దాక్కున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇచ్చిన సమాచారంతో సహస్ర మర్డర్ మిస్టరీ వీడిపోయింది.
బాలుడి స్కూలుకు వెళ్లి ప్రశ్నించగా అతని నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో అతడి ఇంట్లో సోదాలు చేయగా..లెటర్, కత్తి, రక్తంతో కూడిన దుస్తులు దొరకడంతో కేసు మిస్టరీ వీడిపోయింది. కేసు చేధనకు పోలీసులు డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం, సీసీ కెమెరాల ఫుటేజీలతో ఆధారాలు సేకరించినప్పటికి నిందితుడు పక్క భవనం నుంచి బాలిక ఇంట్లోకి రావడంతో నిందితుడిని గుర్తించలేకపోయారు. చివరకు బాలుడు వ్యవహారశైలిపై అనుమానంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో కేసు మిస్టరీ వీడింది.