భారత విప్లవోద్యమ నాయకురాలు … రాధక్క ఆశయాలను కొనసాగిద్దాం
సిపిఐ (ఎంఎల్) పార్టీ కేంద్ర నాయకురాలు గోదావరి లోయ ప్రతిఘటన పోరాట నిర్మాత చండ్ర పుల్లారెడ్డి సహచరి రాధక్క మంగళవారం హైదరాబాదులో క్యాన్సర్ వ్యాధితో మృతి చెందారు.

రాధక్కకు ఘనంగా నివాళులు
విధాత, వరంగల్ ప్రతినిధి: సిపిఐ (ఎంఎల్) పార్టీ కేంద్ర నాయకురాలు గోదావరి లోయ ప్రతిఘటన పోరాట నిర్మాత చండ్ర పుల్లారెడ్డి సహచరి రాధక్క మంగళవారం హైదరాబాదులో క్యాన్సర్ వ్యాధితో మృతి చెందారు.
రాధక్కను స్మరించుకుంటూ బుధవారం ఖిలా వరంగల్లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జరిగిన కార్యక్రమానికి న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు రాచర్ల బాలరాజు అధ్యక్షత వహించగా న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గంగుల దయాకర్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్, మానవ హక్కుల వేదిక జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు లు మాట్లాడారు.
రాధక్క తను పాలిటెక్నిక్ విద్య అభ్యసించే క్రమంలోనే విప్లవ భావాలవైపు ఆకర్షితులయ్యారని స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘం లో పనిచేశారని వారు తెలిపారు. సిపిఎం పార్టీ పార్లమెంటరీ రాజకీయాలను వ్యతిరేకించి విప్లవకారులు బయటికి వచ్చి చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో రహస్య విప్లవ దళాల నిర్మాణానికి నిర్మాణం చేస్తున్న క్రమంలో, తాను కూడా కొంతమంది మహిళలతో దళ నిర్మాణం చేసి కమాండర్ గా పని చేశారు. తన దళంపై పోలీసుల దాడి జరిగిన సందర్భాలలో తోటి కామ్రేడ్లు చనిపోయినా ఆత్మవిశ్వాసంతో ముందుండి నాయకత్వం వహించారు.
రాధక్క ఆయుధాలతో పట్టుబడిన తర్వాత జైలు జీవితాన్ని గడిపారు. అరెస్ట్ అయిన పలు సందర్భాలలో ప్రభుత్వ నిర్బంధానికి గురైనారు. ఈ దోపిడీ పాలకవర్గాల విధానాలకు ప్రత్యామ్నాయం పీడిత ప్రజల విముక్తికి నూతన ప్రజా స్వామిక విప్లవమే ఏకైక మార్గమని విశ్వసించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక వివిధ రాష్ట్రాలలో విప్లవోద్యమ నిర్మాణానికి కృషి చేశారు రాజకీయంగా సిద్ధాంతపరంగా మితవాద రివిజనిస్టు రాజకీయాలపై పోరాడారు. రాధక్క మరణం విప్లవోద్యమానికి తీరని లోటని, ఆమె ఆశయాలను కొనసాగిస్తామని వారన్నారు.
ఈ సంతాప కార్యక్రమంలో , బెల్లంకొండ రమేష్, వేణుగోపాల్, ఆకుల కుమారస్వామి, భైరబోయిన ఐలయ్య, గండ్రతి హరిబాబు, ఇనుముల కృష్ణ, ఎండి అక్బర్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
**