డిక్లరేషన్‌లో చెప్పిన రిజర్వేషన్లు పెంచాలి.. లేదంటే నిరసనలు: మంద కృష్ణ మాదిగ
కామారెడ్డి సభలో చేసిన డిక్లరేషన్ మేరకు కులగణన చేసి జూన్ 11వ తేదీ లోపు రిజర్వేషన్లు పెంచాలని లేకుంటే అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి సభలో చేసిన డిక్లరేషన్ మేరకు కులగణన చేసి జూన్ 11వ తేదీ లోపు రిజర్వేషన్లు పెంచాలని లేకుంటే అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో ఎవరూ అనందంగా లేరని, ముఖ్యంగా కాంగ్రెస్ మరోసారి మాదిగలకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు.. రేవంత్ రెడ్డి విలువల్లేని, విధానాలు లేని రాజకీయాలు చేస్తున్నారని, ఇలాంటి రాజకీయాలు ఎల్లకాలం చెల్లవని, లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. రిజర్వేషన్లు పెంచకపోతే ఎస్సీ, ఎస్టీ బీసీలతో కలిసి ఉద్యమిస్తామని మాదిగల సత్తా ఏమిటో ప్రభుత్వానికి చాటుతామన్నారు.