Cm Revanthreddy | నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించండి.. మేడారం ప‌నుల‌పై సీఎం సమీక్ష

మేడారం అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌తాప్ర‌మాణాలు పాటించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మేడారం అభివృద్ధి ప‌నుల‌పై త‌న నివాసంలో సీఎం సోమవారం స‌మీక్ష నిర్వ‌హించారు.

Cm Revanthreddy | నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించండి.. మేడారం ప‌నుల‌పై సీఎం సమీక్ష

విధాత‌, హైద‌రాబాద్‌:

మేడారం అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌తాప్ర‌మాణాలు పాటించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి ప‌నులను ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌వేక్షించాల‌ని.. ఏ మాత్రం పొర‌పాట్లు దొర్లినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం హెచ్చరించారు. మేడారం అభివృద్ధి ప‌నుల‌పై త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. రాతి ప‌నుల‌తో పాటు ర‌హ‌దారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గ‌ద్దెల చుట్టూ భ‌క్తుల రాక‌పోక‌ల‌కు సంబంధించిన మార్గాలు, భ‌క్తులు వేచి చూసే ప్ర‌దేశాలు ఇలా ప్ర‌తి ఒక్క అంశంపైనా ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు. ప‌నులు సాగుతున్న తీరుపై ప్ర‌ద‌ర్శించిన‌ పవ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్‌ను ప‌రిశీలించిన ముఖ్య‌మంత్రి ప‌లు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను సూచించారు.

ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ‌, దేవాదాయ శాఖ‌, అట‌వీ శాఖ‌, స్థ‌ప‌తి శివ‌నాగిరెడ్డి స‌మ‌న్వ‌యంతో సాగాలని సీఎం సూచించారు. అభివృద్ధి ప‌నుల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్ర‌దాయాలు, ఆచారాల‌కు పెద్ద పీట వేయాల‌ని సీఎం తెలిపారు. నిర్దేశిత స‌మ‌యంలోనే అభివృద్ధి ప‌నులు పూర్తి కావాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్‌, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, సీఎం ముఖ్య కార్య‌ద‌ర్శి కే.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ హ‌రీష్‌, ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహ‌న్ నాయ‌క్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.