Medaram Jatara : అంగరంగ వైభవంగా నూతన గద్దెల ప్రతిష్టాపన
మేడారంలో మాస్టర్ ప్లాన్ పనుల అనంతరం నూతనంగా నిర్మించిన గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిష్ఠాపన ఉత్సవం ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది.
విధాత, ప్రత్యేక ప్రతినిధి: ఆదివాసీ గిరిజనుల సాంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా నూతన గద్దెలపైన పగిడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిష్ఠాపన ఉత్సవం బుధవారం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మాస్టర్ ప్లాన్ లో భాగంగా కొనసాగిస్తున్న అభివృద్ధి పనుల అనంతరం తొలిసారి చేపట్టిన ఈ గద్దెల పై ప్రతిష్టాపనతో మేడారం కొత్త శోభను సంతరించుకున్నది. తమ ఇష్టదైవాలైన పగిడిద్దరాజు, గోవిందరాజుల వంశస్థులు ఆదివాసీ ముఖ్యంగా కోయ సంప్రదాయాల ప్రకారం ఈ తంతును నిర్వహించారు. పగిడిద్దరాజు వంశస్థులు కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి, గోవిందరాజుల వంశస్థులు ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి తమ వంశాచారం ప్రకారం గద్దెలపైకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ రాంనాథ్ కేకన్ లు పాల్గొన్నారు. బుధవారం ఉదయం నుంచే ఈ గద్దెలపైకి తమ ఇలవేల్పులను ప్రతిష్టించే ఉత్సవం సాగింది. మేడారం లో సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనులు చేపట్టగా భక్తులకు దర్శన సౌకర్యార్థం ఒకే వరుసలో నూతనంగా ఆదివాసీ సాంప్రాయాల ప్రకారం పూజారుల సంస్కృతి పద్ధతిలో గద్దెల ప్రాంతంలో చేస్తున్న పునరుద్ధరణ పనులలో భాగంగా నూతన గద్దెల మీద బుదవారం ఉదయం ఆదివాసీ డోలు చప్పుళ్ళతో, సంప్రదాయ నృత్యాలతో అంగరంగ వైభవంగా పగిడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిష్ఠాపన కార్యక్రమం చేపట్టారు.
ప్రకృతి సిద్ధాంతమే ఆదివాసీ ఆచారం: సీతక్క
మేడారంలోనీ పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల తరలింపు ఆదివాసీ వడ్డెల (పూజారుల) అనుమతితోనే ప్రతిష్ఠాపన చేస్తున్నామని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. పూర్వికులు ఇచ్చిన ఆదేశాలతో పాటు పకృతి సిద్ధాంతాన్ని ఆచరించడమే ఆదివాసీ ఆచారమని స్పష్టం చేశారు. బుధవారం జరిగిన ఉత్సవం సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఓకే లైన్లో వన దేవతలు ఉండడం వలన భక్తులు దర్శనాలు చేసుకోవడానికి సులువు తరంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ మార్పు చేశామన్నారు. జాతరలో మొదటి ఘట్టం ప్రారంభమైందన్నారు. జాతరకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. పూర్వకాలం నుంచి గిరిజనులకు పసుపుతో ఎంతో బంధం ఉందన్నారు. శాస్త్రీయంగా పసుపుతో పలు వ్యాధులను నయం చేసుకునే అవకాశం ఉందన్నారు. పూర్వం నుంచి గిరిజనులు ఎలాంటి వ్యాధుల బారిన పడినా పసుపును వాడుతున్నారని తెలిపారు. సమ్మక్క తల్లి గోత్రం బండారి గోత్రమని, తమ ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం ప్రతి పనిని కుడి నుండి ఎడమవైపు నడుస్తుందని, నవగ్రహాలు సైతం కుడి నుండి ఎడమవైపే తిరుగుతున్నాయని వివరించారు. స్వస్తిక్ ఏర్పాటు చేసే విషయంలో సైతం పకృతి సిద్ధాంతాన్ని ఆచరించామన్నారు. ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కల్యాణి, వడ్డెల (పూజారుల) సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, మేడారం సర్పంచ్ పిరిల భారతీ వెంకన్న, ఆదివాసి పూజారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బుధవారం మేడారంలో సామాన్య భక్తులకు దర్శనాలు బంద్ చేసినప్పటికీ సమాచారం తెలియని భక్తులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి :
Shivaji | వివాదంపై మళ్లీ నోరు విప్పిన శివాజీ.. వాటికి కట్టుబడే ఉంటానంటూ సంచలన కామెంట్స్
Future City : ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ సమ్మిట్ ఊపు… రియల్ ఎస్టేట్ జోరందుకుంటుందా?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram