Future City : ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ సమ్మిట్ ఊపు… రియల్ ఎస్టేట్ జోరందుకుంటుందా?
ఫ్యూచర్ సిటీలో ₹5.75 లక్షల కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరందుకోనుంది. గ్లోబల్ సమ్మిట్ తెచ్చిన ఊపుతో దక్షిణ హైదరాబాద్ మార్కెట్ మారుతుందా? పూర్తి విశ్లేషణ.
హైదరాబాద్, సికిందరాబాద్ నగరాలు. ఆ తరువాత సైబరాబాద్ సిటీ ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నది. భారత దేశంలోనే మొట్ట మొదటి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ఇది. టెక్నాలజీ, పరిశ్రమలు, సుస్థిరతపై దృష్టి సారిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ టూరిజం, స్పోర్ట్స్, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి రంగాలకు ఫ్యూచర్ సిటీ కేంద్రంగా మారనున్నది. శ్రీశైలం నాగార్జున సాగర్ రోడ్ల మధ్య సుమారు 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీని ప్రత్యేకతలు తెలియచేసేందుకు, హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. ఈ సమ్మిట్ ద్వారా ప్రభుత్వం రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు కూడా సాధించింది. నిరంతర కార్యకలపాలు, పెట్టుబడిదారుల సౌలభ్యం కోసం అక్కడే ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు.
పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8,9 తేదీలలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. పోటీ పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచ దేశాలతో అనే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సమ్మిట్ దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సీఈవోలు హాజరయ్యారు. 46 దేశాలకు చెందిన 1686 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. పలు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ముఖ్యంగా విద్యుత్, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్, పర్యాటకం వంటి రంగాలలో పెట్టుబడులు వచ్చాయి. 2047 నాటికి భారతదేశం నాల్గవ ఆర్థిక శక్తిగా అవతరించాలన్న ఏకైక లక్ష్యంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. విజన్ 2047 డాక్యుమెంట్ విడుదలతో రాష్ట్ర భవిష్యత్తు ప్రగతికి స్పష్టమైన రోడ్డు మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించారు.
ఫ్యూచర్ సిటీలో గ్రీన్ అగ్రికల్చర్, విమెన్, యూత్ స్కిల్, ఫార్మా, ఎడ్యుకేషన్, టూరిజం, హెల్త్, ఐటీ రంగాలకు చెందిన సంస్థలను నెలకొల్పేందుకు విజన్ డాక్యుమెంట్ రూపొందించారు. ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న మొత్తం 56 గ్రామాలలో ఒక్కో రంగానికి చెందిన సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సమ్మిళితంగా అభివృద్ధి చేయాలనే సంకల్పం, విజన్ తో ముందుకు వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తొలి రోజు రూ.3,97,500 కోట్లు, రెండో రోజు రూ.1,77,500 కోట్లకు వివిధ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాల ద్వారా తెలంగాణ మూడు ట్రిలియన్ల ఎకానమీ చేరుకుంటుందని ఆర్థిక వేత్తలు అభిప్రాపయడుతున్నారు. వచ్చే ఏడాది దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ సదస్సుకు ఇఫ్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. దావోస్ లో కూడా విజన్ 2047 డాక్యుమెంట్ వివరాలు వెల్లడించడంతో పాటు పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయ ప్రాంతమని చెప్పనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో జాతీయ, అంతర్జాతీయ టెక్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు ఉన్న విషయాన్ని వివరించనున్నారు. హైడ్రా ఏర్పాటుతో నగరంలో రియల్ ఎస్టేట్ రంగం చాలా వరకు పడిపోయింది. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలలో భూములు ధరలు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. అమెరికా దేశంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న విధానాల మూలంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నెమ్మదించాయి. టెక్ కంపెనీలలో పింక్ స్లిప్ లు, ఉద్యోగుల మూకుమ్మడి తొలగింపులు, ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఏఐ వినియోగం వంటి కారణాలు కూడా తోడయ్యాయి. దీంతో రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన విధంగా వృద్ధి సాధించడం లేదు. ఫలితంగా మిగతా రంగాలలో ఈ ప్రభావం స్పష్టంగా కన్పిస్తున్నది. అయితే వచ్చే ఏడాది మార్చి నెలలో 2025-26 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తరువాత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు తెచ్చే విధంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :
ISRO’s Baahubali Rocket | అమెరికా ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో LVM3-M6 రాకెట్
Rashmika | రష్మిక ఖాతాలో మరో హిట్ చేరడం ఖాయం.. మైసా గ్లింప్స్‌కి ఫిదా కావల్సిందే..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram