OTT Movies | సంక్రాంతి బ్లాక్‌బస్టర్లు ఓటీటీలోకి.. ఒకే రోజు స్ట్రీమింగ్‌తో డిజిటల్ ప్రేక్షకులకు డబుల్ ట్రీట్
OTT Movies | ఒకప్పుడు వినోదం అంటే థియేటర్లకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ఓటీటీ వేదికలతో సినిమాలు నేరుగా ఇంటింటికీ చేరుతున్నాయి. ముఖ్యంగా పండుగ సీజన్లలో విడుదలై హిట్ అయిన సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఎప్పుడు స్ట్రీమింగ్‌కు వస్తాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
OTT Movies | ఒకప్పుడు వినోదం అంటే థియేటర్లకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ఓటీటీ వేదికలతో సినిమాలు నేరుగా ఇంటింటికీ చేరుతున్నాయి. ముఖ్యంగా పండుగ సీజన్లలో విడుదలై హిట్ అయిన సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఎప్పుడు స్ట్రీమింగ్‌కు వస్తాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలోకి రావడంతో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎలాంటి లోటు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సీజన్‌ను షేక్ చేసిన రెండు భారీ చిత్రాలు ఒకేరోజు ఓటీటీలోకి వచ్చి సినీప్రియులకు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి.
సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్‌స్టార్ నయనతార జంటగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. వరుస పరాజయాల తర్వాత చిరంజీవికి వచ్చిన ఈ సినిమా మెగా అభిమానులకు పండగలా మారింది. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ఫిబ్రవరి 11 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమా కథ సెంట్రల్ మినిస్టర్‌కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేసే శంకర వరప్రసాద్ జీవితం చుట్టూ తిరుగుతుంది. బయటకు సరదాగా కనిపించే ఈ పాత్రలో లోతైన భావోద్వేగాలు దాగి ఉంటాయి. భార్యా పిల్లలతో దూరమైన అతడు తిరిగి కుటుంబానికి చేరువ కావడానికి చేసే ప్రయత్నాలే కథకు ప్రధాన బలం. అనిల్ రావిపూడి టేకింగ్, చిరంజీవి వింటేజ్ లుక్, నయనతార సమతుల్య నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అశ్లీలత, అసభ్యత లేకుండా కుటుంబమంతా కలిసి చూడగలిగేలా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో భారీ స్పందన తెచ్చుకోవడంతో పాటు రీజనల్ సినిమాల్లో ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే మ్యాజిక్ కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి.
ఇక మరోవైపు సంక్రాంతి రేసులో సాలిడ్ హిట్‌గా నిలిచిన ‘అనగనగా ఒక రాజు’ కూడా అదే రోజున డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమాకు యువత నుంచి మంచి ఆదరణ లభించింది. థియేటర్లలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
‘అనగనగా ఒక రాజు’ కథ పాత జమీందారీ కుటుంబానికి చెందిన యువకుడి జీవితాన్ని కేంద్రీకరించుకుని సాగుతుంది. తాతల కాలంలో పోయిన ఆస్తులు, గత వైభవం, ప్రస్తుతం ఎదురయ్యే అవమానాలు కథలో ఆసక్తిని పెంచుతాయి. ఓ సవాల్, ఓ పెళ్లి, ఆ తర్వాత వచ్చే ట్విస్టులు సినిమాను వినోదాత్మకంగా ముందుకు నడిపిస్తాయి. కామెడీ, భావోద్వేగాలు, రాజకీయ నేపథ్యం కలగలిపిన ఈ చిత్రం బోర్ లేకుండా సాగుతుంది. నవీన్ పోలిశెట్టి టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
మొత్తానికి సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేసిన ఈ రెండు చిత్రాలు ఇప్పుడు ఓటీటీ వేదికలపై మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. థియేటర్లలో మిస్ అయినవారికి, మళ్లీ చూడాలనుకునే అభిమానులకు ఇవి నిజంగా డబుల్ ట్రీట్ అనే చెప్పాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram