ఎదుగుదల ఓర్వలేక విషప్రచారం.. అందుకే పరువునష్టం దావా వేసిన: మంత్రి సీతక్క

ఆదివాసి మహిళ అని చూడకుండా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక ప్రత్యర్ధులు తనపై, తన వ్యక్తిత్వం పై విష ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు

ఎదుగుదల ఓర్వలేక విషప్రచారం.. అందుకే పరువునష్టం దావా వేసిన: మంత్రి సీతక్క

రణధీర పేరుతో పనిచేశా
నచ్చిన పేరుతో పుస్తకం
ఈ గడ్డ గౌరవాన్ని కాపాడుతా
రణధీర సీతక్క పుస్తకావిష్కరణ సభలో రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క

విధాత ప్రత్యేక ప్రతినిధి: ఆదివాసి మహిళ అని చూడకుండా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక ప్రత్యర్ధులు తనపై, తన వ్యక్తిత్వం పై విష ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సంబంధం లేని విషయంతో అంటగడుతూ…ఉద్యమనాటి కక్షలను ఇప్పుడు చూపెడుతూ కేవలం స్థానిక వనరులపై తమ ఆధిపత్యం దక్కలేదనే అక్కసుతో ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఈ విష ప్రచారానికి విసుగొచ్చి కేసీఆర్ మీద పరువునష్టం దావా వేశానని తెలిపారు. ఇప్పటి వరకు కోయజాతిలో మంత్రులుగా అవకాశం దక్కిన వారే లేరు.. అందులో మహిళకు అరుదైన గౌరవం లభించిందన్నారు. డీకే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అస్నాల శ్రీనివాస్ మంత్రి సీతక్కపై జీవితంపై రాసిన ‘రణధీర సీతక్క’ పుస్తకావిష్కరణ సభ హనుమకొండ జడ్పీ హాల్ లో ఆదివారం సాయంత్రం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క, విశిష్ట అతిథులుగా ఎంపీ కడియం కావ్య, తేజావత్ బెల్లయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. తొలుత అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క పుస్తకంపై తన స్పందన తెలియజేస్తూ ప్రసంగించారు. నక్సలైట్ ఉద్యమాల్లో పనిచేసినపుడు రణధీర అనే పేరుతో ప్రకటనలు వచ్చేవని.. ఉనికి తెలియకుండా ఇలాంటి పేర్లు వాడేవాళ్లమని … తనకు నచ్చిన పేరు పుస్తకం టైటిల్ లో ఉండటం ఎంతో ఆనందాన్నిచ్చిందని.. రణధీర సీతక్క పుస్తకం మరింత బాధ్యత పెంచిందని మంత్రి ధనసరి సీతక్క అన్నారు.

ఓర్వలేక విషప్రచారం

కరోనా కాలంలో రీళ్ల కోసం కాదు రియల్ గా చేశాము.. కానీ దీన్ని కొందరు రాజకీయాల చేశారని..ఇది చాలా బాధ అనిపించిందని మంత్రి సీతక్క అన్నారు. బీఆరెఎస్ సోషల్ మీడియా చూసే వ్యక్తి ములుగు దగ్గర గుంటూరుపల్లి అని.. నాడు 1987లో నక్సలైట్ ఉద్యమంలో జరిగిన సంఘటన తనకు ఎలాంటి సంబంధం లేదని.. తాను ఉద్యమంలోకి వెళ్లింది 1988 లో అన్నారు. తనలాంటి కోయజాతి మహిళపై ట్రోల్ చేయడం అవసరమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చావును ఎదిరించి వచ్చిన వాళ్ళం.. తూటాలు చూసినం.. కరోనా చూసినం.. అయినా సేవ చేస్తుంటే కూడా లేనిపోని సృష్టించి ప్రచారం చేయడం తగదన్నారు.

కనిపెంచిన జాతికి చెడ్డ పేరు తీసుకురానని.. ఉద్యమ గౌరవాలుంటాయి.. గెలిపించిన ప్రజల నమ్మకాన్ని, కన్న తల్లిదండ్రులు.. ఎవరి ఆశయాలను వమ్ము చేయనని అన్నారు. కరోనా టైమ్ లో చేసిన సేవకు అమెరికా పత్రికలు కూడా సీతక్క ఎవరు అని వెతికారని అన్నారు. రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు సాధారణమే కాని.. మరీ ఇంత కుట్రపూరిత పనులు ఉంటాయా అనే ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నాయన్నారు. తాను పుట్టినప్పటినుంచి ఎన్నో కష్టాలు అనుభవించానని.. నాడు పూటకు కూడా అన్నం దొరుకుతుందో లేదోననే పేదరికం ఉండేదన్నారు. తల్లిదండ్రులు పనికి వెళ్లితే వాళ్లు తెచ్చే ఆహారం కోసం ఎదురుచూసేవాళ్లమని అన్నారు. అలాంటి పరిస్థితులు చూసి పెరిగిన తనపై కుట్రలు చేయడం తగదన్నారు.

నేనేమి అనుకోకుండానే ఈ స్థాయికి

చదువుకునే రోజుల్లో నక్సలైట్ ను అయిత అనుకోలేదు .. ఆ తరవాత అడ్వకేట్ .. ఎమ్మెల్యే …. తరవాత పీహెచ్ డీ పూర్తి చేస్తామని అనుకోలేదని మంత్రి సీతక్క అన్నారు. నిజాయితీగా ప్రజల సేవకే అంకితమవ్వాలని.. విలువలతో కట్టుబడి పనిచేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. విప్లవోద్యమంలో పనిచేసిన అనుభవం వల్ల శ్రమ … ప్రజల పట్ల గౌరవం ఉంటాయని. పేదరిక నిర్మూలన జరిగినపుడే సమసమాజ స్థాపన సాధ్యమని అన్నారు. పొలిటికల్ పార్టీలో ఉన్నప్పటికి మమ్మల్ని మేధావివర్గం తనను జాగ్రత్తగా ఉండాలని తట్టి చెబుతారని అన్నారు.

అడవి పూవు సీతక్క : ఎంపీ కడియం కావ్య

అచ్చమైన అడవి పూవు అంటూ ఎంపీ కడియం కావ్య పోల్చారు. మంత్రి సీతక్క గురించి ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నానని.. మొదటి మహిళా దళ కమాండర్, మొదటి సారిగా ఏకే 47 పట్టిన మహిళగా పేరు తెచ్చుకోవడం గొప్ప విషయమన్నారు. పుస్తకాలు ఎక్కువగా చదవుతూ.. మనుషుల్ని ఎక్కువగా కలిస్తేనే మనకున్న నాలెడ్జ్ పెరుగుతుందన్నారు. నిరంతర పోరాటశీలి.. నూరుశాతం ప్రజల్లో ఉండే మనిషి అన్నారు. తనలాంటి వెనకబడిన వర్గాల నుంచి మహిళలకు సీతక్క ఆదర్శమన్నారు. కవిత నచ్చిన సీతక్క కావ్యను ఆత్మీయ ఆలింగనం చేసుకుంది.

వరంగల్ వేఢి తగ్గుతుందా?: బెల్లయ్య నాయక్

ఒకప్పుడు అన్ని ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వరంగల్ లో మేధోమధనం.. చర్చ జరగడం తగ్గిందా.. నాటి వరంగల్ వేఢి తగ్గిందా.. ఇక్కడ మరింత మేధోమదనం జరగాలి మేధావులంతా చర్చలు చేపట్టాలని గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. పుస్తకావిష్కరణ చేసిన ఆయన కీలకోపాన్యాసం చేశారు. అడవిలో సీతక్క.. మంత్రి సీతక్కలో ఎలాంటి మార్పు లేదని.. నాటి అంకితభావంతోనే పని చేస్తుందని అన్నారు. మారోజు వీరన్న, సీతక్క లాంటి వాళ్లు చేసిన కఠోర శ్రమ వల్లనే ఈ రోజు రాహూల్ గాంధీ చేతిలో రాజ్యాంగం ఉందన్నారు. ఎన్నో ఇబ్బందులున్నా సేవ చేయాలనే సంకల్పంతో సీతక్క ముందుకెళ్తుందన్నారు. ప్రజస్వామ్యం గురించి కొట్లాడే వారిని.. ప్రజల సమస్యల పట్ల మాట్లాడేవారిని అర్బన్ నక్సలైట్లుగా చిత్రీకరిస్తున్న బీజేపీ ప్రభుత్వం.. చివరకు రాహుల్ గాంధీని సైతం అర్బన్ నక్సలైట్ గా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

ఇదో హెచ్చరిక లాంటిది: సంగోజు రవి, సీనియర్ జర్నలిస్టు

అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వారి చరిత్రలను రికార్డు చేయాలని సీనియర్ జర్నలిస్టు సంగోజు రవి అన్నారు. ఈ పుస్తకం రూపుదిద్దుకోవడంలో తన వంతు పాత్ర ఉందన్నారు. సీతక్క కుటుంబంలో ఇద్దరు ఎన్ కౌంటర్ అయ్యారని వివరించారు. ప్రస్తుతం అధికార పార్టీలో మంత్రిగా చేస్తున్న ఈ పాత్రను నిర్వర్తించేటపుడు ఎంతో జాగ్రత్త అవసరం. ఇది అవకాశమే కాదు.. ఇదో హెచ్చరిక కూడా..ప్రజల పట్ల తనకున్న ఈ కమిట్ మెంట్ సీతక్కకు అత్యవసరమన్నారు. ఎన్ని రోజులు కొనసాగిస్తే అన్ని రోజులు మనుగడ ఉంటుందన్నారు. అధికారిక మీటింగ్ లో తనపై ఎందుకు మాట్లాడుతున్నారని గతపాలక నేతలను ప్రశ్నించిందుకే సీతక్క టార్గెట్ అయింది. అయినా తను చేసిన మంచి పనులే మళ్ళీ గెలిపించాయన్నారు.

మన చరిత్ర మనమే లిఖించుకోవాలి:తీగెల జీవన్

బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తీగల జీవన్ గౌడ్ రణధీర సీతక్క పుస్తక సమీక్ష చేపట్టారు. పుస్తకం మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారంతో మొదలై .. తన మీద ప్రజలకు చేయాల్సిన అదనపు బాధ్యతలు ఉన్నాయని ముగించే విధానాన్ని ఆయన కళ్లకు కట్టినట్లు చూపించారు. మన చరిత్ర మనమే లిఖించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు.

సీతక్క ఉన్నత స్థాయికి ఎదగాలి: శ్రీనివాస్

సీతక్క జీవితం అందరికి తెలియానే ఉద్దేశంతోనే పుస్తకాన్ని రాసానని.. తనతో ఉన్న పరిచయం.. అనుబంధంతోనే పుస్తకాన్ని పూర్తి చేశానని రచయిత అస్నాల శ్రీనివాస్ తెలిపారు. తొలి మహిళా కమాండర్ చరిత్రలో పేరున్న సీతక్క త్వరలోనే త్రివిధ దళాల కమాండర్ కావాలని అస్నాల అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్త రియాజ్, టీజీవో ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, నరసింహులు, అప్పారావు, పాండురంగారావు, సురేష్, రామక్రిష్ణ , కవులు, రచయితలు, అభిమానులు పాల్గొన్నారు.