అప్పులపై మంత్రి జూపల్లి వర్సెస్ హరీశ్ రావు ఫైట్

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో...కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల లెక్కలపై మరోసారి మంత్రి జూపల్లి కృష్ణారావుకు, మాజీ మంత్రి టి.హరీశ్ రావు కు మధ్య శుక్రవారం కూడా సవాళ్ల పర్వం కొనసాగింది.

విధాత, హైదరాబాద్:  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో…కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల లెక్కలపై మరోసారి మంత్రి జూపల్లి కృష్ణారావుకు, మాజీ మంత్రి టి.హరీశ్ రావు కు మధ్య శుక్రవారం కూడా సవాళ్ల పర్వం కొనసాగింది. మీడియా సమావేశంలో మాట్లాడిన జూపల్లి..తాను అప్పుల లెక్కలపై సవాల్ చేసి తోకముడిచినట్లుగా హరీశ్ రావు, కేటీఆర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, నా ఆరోపణలు తప్పని రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మరీ బీఆర్‌ఎస్ ఆరోపణలు తప్పని తేలితే ఏం చేస్తారో చెప్పాలని సవాల్ చేశారు. నేను పారిపోయే వాడినో..పౌరుషం లేనివాడినో కాను అని స్పష్టం చేశారు

. నేను బీఆర్ఎస్ కు రాసిన లేఖలో బీఆర్ఎస్ అప్పుల లెక్కలు, నా మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాయడం జరిగిందని గుర్తు చేశారు. నా ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు రాతపూర్వకంగా జవాబు చెప్పవచ్చని..లేదంటే సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు ఈ రోజు కూడా రమ్మంటే వస్తానని జూపల్లి స్పష్టం చేశారు. నేను సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వస్తాను. దమ్ముంటే మీరు ఏం చెస్తారో చెప్పి అక్కడికి రావాలని సవాల్ చేశారు.

అప్పులపై కేటీఆర్, హరీశ్ రావుల అసత్య ప్రచారాలు…

బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణపై రూ.8లక్షల 21,651  కోట్ల ఆర్థిక భారం మిగిల్చిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆయన విమర్శిస్తూ దానికి సంబందించిన లెక్కలను విడుదల చేశారు. బీఆర్‌ఎస్‌ అప్పులపై కేటీఆర్‌, హరీశ్ రావు అసత్యాలు చెబుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో రూ.3లక్షల 17వేల 15కోట్లు మాత్రమే అని ఒకసారి, రూ. 3 లక్షల 85,340కోట్లు అని మరోసారి చెప్పారని, హరీశ్ రావు మాట్లాడుతూ..రూ. 4,26,499కోట్లు అని ఒకసారి, రూ. 4,17,496కోట్లు అని మరోసారి చెప్పారని జూపల్లి ఆరోపించారు. దమ్ముంటే దీనిపై రాతపూర్వక సమాధానం ఇవ్వాలని, కేసీఆర్ తో అసలు మీరు చేసినంత అప్పులు ఎన్నో చెప్పించాలని.. లేదంటే నాకు వాట్సాప్ చేయాలని, చర్చకు రమ్మంటే వస్తానని జూపల్లి స్పష్టం చేశారు.

అప్పులు మూడు ర‌కాలు…

బీఆర్ఎస్ హ‌యాంలో అప్పులు, బ‌కాయిలు క‌లిపి 8,21,651 కోట్ల అప్పులు చేశారని, కార్పొరేష‌న్లు తెచ్చిన అప్పులతో మాకు సంబంధం లేదు, మేం తేలేద‌ని చెపుతున్నారని జూపల్లి గుర్తు చేశారు.ర
మీరు అప్పులు తేక‌పోతే ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి ఎందుకు చెల్లించారని, కాళేశ్వ‌రం, పాల‌మూరు కోసం అప్పులు తెస్తే వాటిని రైతుల‌తో క‌ట్టిస్తారా..? మిష‌న్ భ‌గీర‌థ పేరుతో తెచ్చిన అప్పులు ఎవ‌రు క‌డ‌తారు..? మంచి నీళ్లు తాగుతున్న ప్ర‌జ‌ల‌తో క‌ట్టిస్తారా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీ కి రావ‌డం లేదు.. క‌నీసం మీడియా ను పిలిచి కేసీఆర్ మాట్లాడాలన్నారు. 5 గంట‌ల‌కు నేను ప్రెస్ క్ల‌బ్ కు వ‌స్తా.. అక్క‌డైనా చ‌ర్చ‌కు సిద్ధం.. రుజువు చేయ‌పోతే ఎమ్మ‌ల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తారా.. పార్టీని కేసీఆర్ ర‌ద్దు చేస్తారా.. స‌మాధానం తీసుకుని రావాలని, నేను రాజీనామాకు సిద్ధం అన్నారు.

గతంలో పాల‌మూరు పౌరుషం , చీము ,నెత్తురు ఉండ‌బ‌ట్టే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశానని, కుడి భుజం, ఎడ‌మ భుజం అని చెప్పుకున్న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో మీరు ఒక్క సీటు తేలేక‌పోయారు.. నేను రాజీనామా చేశాకే జిల్లాలో 6 సీట్లు బీఆర్ఎస్ కు వ‌చ్చాయి అని జూపల్లి గుర్తు చేశారు. నా రాజీనామా ప్ర‌భావం ఆనాడు రాష్ట్రమంతా ఉందని, నేను మాట‌కు క‌ట్టుబ‌డి ఉండే వ్య‌క్తిని.. సిగ్గుత‌ప్పిన మాటలు మాట్లాడుకుంటు నాకు పౌరుషం లేద‌ని అంటున్నారని, హ‌రీష్ రావు వ‌స్తాన‌ని అన్నాడు కాబ‌ట్టే అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద‌కు వ‌స్తాన‌ని చెప్పానన్నారు. తెలంగాణ భ‌వ‌న్ కు రాలేద‌న్న వంక చూపించి విమ‌ర్శిస్తున్నారని, నేను అబ‌ద్దాలు చెప్ప‌ను.. నా ఆత్మ‌గౌర‌వాన్ని ప్ర‌శ్నించ‌లేరు అని జూపల్లి స్పష్టం చేశారు. ఆత్మ గౌర‌వం కోసం ప్ర‌భుత్వ ఉద్యోగానికి నేను గ‌తంలో రాజీనామా చేశానని, ఉద్యోగానికి వెళ్ల‌కుండా ఊరు వెళ్లి వ్య‌వ‌సాయం చేసుకున్నానని, మీ లాగా అడ్డ‌గోలుగా సంపాదించ‌లేదు అన్నారు. అడ్డ‌గోలు మాటలు మాట్లాడి ఆరోప‌ణ‌లు చేస్తే ఖబర్ధార్ అంటూ హెచ్చరించారు. పాల‌మూరు పౌరుష‌మా, క‌ల్వ‌కుంట్ల పౌరుష‌మా, త‌న్నీరు పౌరుష‌మో చెప్పాలన్నారు. నేను తోక‌ముడిచేవాన్నీ కాదు..నాకు ప‌ద‌వులు ముఖ్యం కాదు.. ఆత్మ‌గౌర‌వం ముఖ్యం అని, నా స‌వాల్ కు క‌ట్టుబ‌డి ఉన్నానని, మీ పౌరుషం, రోషం, ప‌ర‌మితి ఏమిటో ద‌మ్ము ధైర్యం ఉంటే చెప్పాలన్నారు. కూట్లో రాయి తీయలేనోడు,ఏట్లో రాయి తీస్తా అన్నట్లుగా కేటీఆర్, హరీష్ రావు తీరు ఉందని, ఎన్నికల ముందు అవుటర్ రింగ్ రోడ్డు ను అమ్మి రైతు బంధు కింద 5,800 కోట్లు మాత్రమే చెల్లించారని గుర్తు చేశారు.

మీ లేఖ అందింది..అప్పులపై కాంగ్రెస్ తప్పుడు లెక్కల సంగతేంటి ? : హరీశ్ రావు

మంత్రి జూపల్లి చెప్పిన అప్పుల లెక్కలపై మాజీ మంత్రి టి.హరీశ్ రావు సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రతిస్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ నుంచి 30నెలల పాలనలో జూన్ వరకు రూ. 1లక్ష 77వేల 58కోట్లు మాత్రమే నని, గత అప్పులకు వడ్డీ, అసలు కలిపి రూ. 2,08,661కోట్లు చెల్లించినట్లుగా మంత్రి జూపల్లి కృష్ణారావు రాసిన లేఖ నాకు అందిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు పేర్కొన్నారు. అయితే రిజర్వ్ బ్యాంకు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 12నుంచి రూ.1లక్ష 86వేల 67కోట్లు గా స్పష్టమవుతుందని తెలిపారు. నాలుగు నెలల కిందట సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మార్చి 18న రూ. 3లక్షల 47,294కోట్ల అప్పు చేసినట్లుగా చెప్పుకుంటున్నారని, జూపల్లి మాత్రం రూ. 1లక్ష 77వేల 58కోట్లు మాత్రమే చెప్పాడని, పాలమూరు పౌరుషం ఉంటే..రోషం ఉంటే వెంటనే చెప్పినట్లుగా పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కాగ్ రిపోర్టు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 4.15లక్షల కోట్లు అని అసెంబ్లీలో చెప్పిందని, నేనూ చెప్పింది, కాగ్ చెప్పింది ఒక్కటేనని, అబద్దాలు చెబుతూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. జూపల్లికి  నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐ లెక్కలు మీకు వాట్సప్ లో పంపుతున్నా చదువుకో
చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయాలని సవాల్ విసురుతున్నాన్న్నారు.

అవినీతి, అప్పులపై మేం చేసిన ఆరోపణలపై చర్చకు సవాల్ చేసిన కాంగ్రెస్ మంత్రులు పారిపోయారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. గన్ పార్క్ కు రమ్మంటే వెళ్లేందుకు సిద్ధమైతే పోలీసులతో మమ్మల్ని అడ్డుకున్నారని, తెలంగాణ భవన్ లో కుర్చీ ఏర్పాటు చేస్తే జూపల్లి రాలేదని, ఇప్పుడు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ అంటున్నారని, జూపల్లి తీరు పూటకో సవాల్ రోజుకో అడ్రస్ లా ఉందని ఎద్దేవా చేశారు. మాపై గోల్ కొడుతామన్న కాంగ్రెస్ మంత్రులు వారే సెల్ఫ్ గోల్ చేసుకున్నారని చురకలేశారు. సీనియర్ మంత్రి అంటూనే మీ క్యాబినెట్ ఎంత అప్పు చేసిందో తెల్వదా నీకు జూపల్లి అని హరీశ్ రావు ప్రశ్నించారు.

Latest News