Minister Komatireddy | చెప్పినట్లుగానే రుణమాఫీ..  మార్చికల్లా బ్రాహ్మణ వెల్లంల పూర్తి: మంత్రి కోమటిరెడ్డి

రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2లక్షల రుణమాఫీ ప్రక్రియను 32వేల కోట్లతో ఆగస్టు మొదటి వారంకల్లా పూర్తి చేస్తామని, ఇప్పటికే 6వేలకోట్లతో లక్ష రూపాయల రుణమాఫీ పూర్తి చేశామని ఆర్‌ఆండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు

Minister Komatireddy | చెప్పినట్లుగానే రుణమాఫీ..  మార్చికల్లా బ్రాహ్మణ వెల్లంల పూర్తి: మంత్రి కోమటిరెడ్డి

ఎస్‌ఎల్బీసీ పూర్తికి గ్రీన్ చానల్‌తో 2,200కోట్లు
విజయవాడ హైదరాబాద్ ఆరులైన్ల పనులకు వచ్చే నెలలో టెండర్లు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడి

విధాత, హైదరాబాద్ : రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2లక్షల రుణమాఫీ ప్రక్రియను 32వేల కోట్లతో ఆగస్టు మొదటి వారంకల్లా పూర్తి చేస్తామని, ఇప్పటికే 6వేలకోట్లతో లక్ష రూపాయల రుణమాఫీ పూర్తి చేశామని ఆర్‌ఆండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నార్కట్‌పల్లి శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి ఆలయంలో సుదర్శన యాగ సహిత రుద్ర యాగంలో, నల్లగొండ పట్టణంలోని సాయిబాబ ఆలయం పూజల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకట్‌రెడ్డి గురు పౌర్ణమి రోజున సుదర్శన హోమం, దైవ పూజల్లో పాల్గొని తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టును వచ్చే మార్చికల్లా పూర్తి చేసి చెరువులు, రిజర్వాయర్లు నింపి ఈ ప్రాంత ప్రజల కళ్లలో ఆనందాన్ని నింపుతామన్నారు.

ఫ్లోరైడ్ నిర్మూలనకు, 4లక్షల ఎకరాలకు సాగునీరు, 600గ్రామాలతో పాటు జంటనగరాలకు తాగునీటిని అందించే లక్ష్యంతో గతంలో తన చొరవతో చేపట్టిన ఎస్‌ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో 2200కోట్లను గ్రీన్ చానల్ ద్వారా మంజూరీ చేయించడం జరిగిందని తెలిపారు. ఒకవైపు పోటీ పరీక్షల నిర్వాహణ, ఇంకోవైపు ఉద్యోగాల భర్తీతో యువత ప్రగతికి కృషి చేస్తున్నామన్నారు. ఇంకోవైపు రుణమాఫీతో రైతు సంక్షేమానికి పాటుపడుతున్నామన్నారు. అన్నదాతలు సుఖంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ ఉద్ధేశమన్నారు. నార్కట్‌పల్లి వారిజాల వేణుగోపాల స్వామి ఆలయంలో 2కోట్ల అభివృద్ధి పనులను త్వరలో చేపడుతామన్నారు. నిరుద్యోగులకు అంతర్జాతీయ స్థాయిలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ తెస్తున్నామని, అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చట్టం చేయబోతున్నామన్నారు.

నల్లగొండ కలెక్టరేట్‌లో 20కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుందన్నారు. 67ఐటీఐలను ఆధునీకరిస్తున్నామన్నారు. ఇలాంటి పనులన్ని విజయవంతం కావాలంటే భగవంతుని ఆశీర్వదం కావాలన్నారు. హైదరాబాద్‌-విజయవాడ ఆరులైన్ల నిర్మాణం చేయించబోతున్నామన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీని మరోసారి కలవబోతున్నానని, వచ్చేనెలలో టెండర్లు పిలవబోతున్నామన్నారు. కేటీఆర్ గవర్నర్‌ను కలిసిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులపైన కేసులు పెడుతుందని, బీఆరెస్‌ ఎమ్మెల్యేలను భయపెట్టి వారి పార్టీలో చేర్చుకుంటున్నారన్న ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు వంటి చెత్త, పాపాత్ముల పేర్లను గురు పౌర్ణమి రోజున నా నోటి నుంచి ప్రస్తావించడం బాగుండదన్నారు. పదేళ్లు పాలించి మొత్తం 17ఎంపీ సీట్లలో ఓడిపోయిన వారు రాజకీయంగా ఏదో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. రైతులకు, ప్రజలకు మేలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే బదులుగా గతంలో దోచుకున్న సొమ్ముతో ఏ దేశమో పోయి బతుకాలని సూచించారు.