Minister Ponguleti | పెద్దవాగు ఘటనపై అధికారులకు షోకాజ్ నోటీస్‌లు: మంత్రి పొంగులేటి

అధికారుల నిర్లక్ష్యంతోనే పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆయన ప్రాజెక్టును పరిశీలించి మాట్లాడారు

Minister Ponguleti | పెద్దవాగు ఘటనపై అధికారులకు షోకాజ్ నోటీస్‌లు: మంత్రి పొంగులేటి

బాధితులకు అన్ని విధాలుగా సహాయం

విధాత, హైదరాబాద్: అధికారుల నిర్లక్ష్యంతోనే పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆయన ప్రాజెక్టును పరిశీలించి మాట్లాడారు. సరైన సమయానికి గేట్లు ఎత్తి ఉంటే ఇంతటి ప్రమాదం జరిగేది కాదన్నారు. పైనుంచి వచ్చే వరదని అంచనా వేయకుండా అధికారులు నిర్లక్యం వహించారని పేర్కొన్నారు. నష్టానికి బాధ్యులైన అధికారులకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చామని, విచారణలో తప్పు తేలితే వారు శిక్షార్హులు అవుతారన్నారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రితో మాట్లాడి తక్షణ మరమ్మతులకు రూ.8 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.

ప్రాజెక్టు కొట్టుకపోవడంతో నష్టం జరిగిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, 400 ఎకరాలు ఇసుక మేటతో పూడుకుపోయిందని తెలిపారు. ఈ ఇసుక తీసేందుకు కొంత నగదు సాయం చేస్తున్నామని, పత్తి, వరి పంట నష్ట పోయిన వారికి విత్తనాలు ఉచితంగా ఇస్తున్నామన్నారు. కొట్టుకుపోయిన గొర్రెలకు ప్రభుత్వం రూ.3 వేలు పరిహారం అందిస్తుందని, ఆవులు, గేదెలకు ఒక్కో దానికి రూ.20 వేలు ఇస్తామని వెల్లడించారు.వరద వల్ల నీట మునిగి ఇళ్లు నష్టపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యేకంగా మంజూరు చేయిస్తామని ప్రకటించారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా రైతు రుణమాపీ చేశామని, లక్ష రూపాయల లోపు ఉన్న ప్రతి ఒక్కరికీ రుణమాఫీ జరిగిందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.