వరుస వివాదాల్లో మినిస్టర్ పొన్నం ప్రభాకర్ .. మొన్న లక్ష్మణ్, నేడు ట్రావెల్స్ బస్సు
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు . మొన్న మంత్రి లక్ష్మణ్‌పై అనుచిత వ్యాఖ్యలు నేడు వేమూరి కావేరి ట్రావెల్స్ తో బద్నాం .. చెక్ పోస్టుల ఎత్తవేతలోనూ నిర్లక్ష్యం ...పాపారావు వీఆర్ఎస్ లోనూ పాత్ర తో మంత్రి పొన్నం ప్రభాకర్ మరింత బద్నాం అయ్యారని కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు.
హైదరాబాద్, విధాత ప్రతినిధి: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తన శాఖలో ఒకదాని తరువాత మరోటిగా జరుగుతున్న తప్పిదాలు ఆయన వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. రవాణా శాఖలో చేతులు తడపనిదే ఏ పని కావడం లేదని జనం కూడా గగ్గోలు పెడుతున్నారు. పాపాల పాపారావు వీఆర్ఎస్ మొదలు శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటనలు ప్రభాకర్ గౌడ్ కు మచ్చగా మిగిలాయని కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. బాధ్యతగా పనిచేయాల్సిన ఆయన.. కట్టు తప్పినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు, అవినీతి పనులకు పాల్పడిన డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాపారావుపై చర్యల విషయంలో ప్రభాకర్ మెతక వైఖరి అవలంబించారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ రవాణా శాఖలో ఒక సాధారణ ఉద్యోగి స్థాయి నుంచి డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వరకు పాపారావు ఎదిగారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చెలరేగిపోవడమే కాకుండా బదిలీలు, పదోన్నతుల విషయాల్లో జోక్యం చేసుకునేవారని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఈయనపై పలువురు రవాణా శాఖ ఉద్యోగులు అప్పటి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కు ఎన్నో ఫిర్యాదుల చేసినా.. పట్టించుకున్న పాపాన పోలేదు. బీఆర్ఎస్ హయాంలో మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి నుంచి డీటీసీ వరకు పదోన్నతులు సునాయసంగా పొందారు. ఆయన పేరు చెబితే చిన్న ఉద్యోగి నుంచి పై స్థాయి వరకు అందరూ తిట్లపురాణం లంకించుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే పాపారావు పాపాలు పండుతాయని ఆ శాఖ ఉద్యోగులు ఆశించారు. సచివాలయంలోని రవాణ శాఖ విభాగం అధికారులు కూడా ఈయనపై పెద్ద ఫైలును తయారు చేశారని సమాచారం. ఈ విషయం తెలియడంతో తనపై కఠిన చర్యలు ఉంటాయని భావించిన పాపారావు.. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు దరఖాస్తు సమర్పించారు. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నప్పటికీ విచారణకు ఆదేశించకుండా, వీఆర్ఎస్ దరఖాస్తుకు ఆమోదం తెలుపటం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో మంత్రి ప్రభాకర్ హస్తం ఉందని ఉద్యోగులు అప్పట్లో చర్చించుకున్నారు. వీఆర్ఎస్ ఆమోదం వెనకాల కోట్ల రూపాయలు చేతులు మారాయనే వాదనలు వినిపించాయి.
మంత్రి లక్ష్మణ్‌పై అనుచిత వ్యాఖ్యలు

మొన్నటికి మొన్న ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌నుద్దేశించి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో భాగంగా నిర్వహించిన సమావేశంలో లక్ష్మణ్ కుమార్ రావాల్సి ఉండగా ఆలస్యమైంది. ఈ సందర్భంగా పొన్నం వాడిన పదాలు పెను వివాదమే రేపాయి. ఈ వ్యాఖ్యలపై దళిత సంఘాలు, ఎమ్మర్పీఎస్ మండి పడ్డాయి. తనను దున్నపోతు అని తిట్టారంటూ లక్ష్మణ్ కుమార్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు అడ్లూరి ఫిర్యాదు చేశారు. అధిష్ఠానం ఆదేశంతో పీసీసీ అధ్యక్షుడు బీ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరినీ తన నివాసానికి పిలిపించుకుని సయోధ్య కుదిర్చారు.
ReadMore: పొన్నం వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం
చెక్ పోస్టుల ఎత్తివేతలోనూ నిర్లక్ష్యం
ఈ ఏడాది జూలై నెలలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో రాష్ట్రంలో రవాణా శాఖ చెక్ పోస్టులను ఎత్తివేయాలని తీర్మానించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక చాలా రాష్ట్రాలలో చెక్ పోస్టులను ఎత్తి వేశారు. 14 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు సహా మొత్తం 15 ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలో ప్రవేశించే వాహనాల నుంచి పన్నుల వసూలు, టెంపరరీ పర్మిట్ల జారీ, మోటర్ వాహనాల చట్టం ఉల్లంఘనలు నియంత్రించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. వీటిపై కొద్ది నెలలుగా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆమ్యామ్యాల కోసమే వీటిని కోనసాగిస్తున్నారని, ఎందుకు తొలగించడం లేదని పలువురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. అవినీతి కోసమే వీటిని కొనసాగిస్తున్నారని, మరో కారణం లేదని ఏసీబీ కూడా నివేదిక ఇవ్వడం గమనార్హం. ఏసీబీ నివేదిక ప్రకారం చర్యలు మొదలయ్యాయి. చెక్ పోస్టులను వెంటనే తొలగించాలని, ఎందుకు జాప్యం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులను బుధవారం సాయంత్రం కల్లా ఎత్తివేశారు. తీసివేసినట్లు డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్లు రవాణా కమిషనర్ కు నివేదిక పంపించారు. చెక్ పోస్టుల ద్వారా రవాణా శాఖకు వచ్చే ఆదాయం 0.82 శాతం కాగా, మొత్తం ఉద్యోగుల్లో 17 శాతం మంది ఇక్కడే పనిచేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
వేమూరి కావేరి ట్రావెల్స్ తో బద్నాం
కర్నూలు జిల్లాలో జాతీయ రహదారిపై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంతో తెలంగాణ రవాణా శాఖ పరువు మరింతగా దిగజారింది. ఆ బస్సుకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేదు. ఇన్సూరెన్స్ కూడా గడువు తీరింది. లెక్కకు మించి ట్రాఫిక్ చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. సీటింగ్ బస్సును స్లీపర్ బస్సుగా మార్చి నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రతినిత్యం తిరుగుతున్నది. అయినా రవాణా శాఖ అధికారులు ఒక్కరంటే ఒక్కరు కూడా చర్యలు తీసుకోలేదు. ఫలితంగా బస్సు 20 మంది అమాయకులైన ప్రజల ప్రాణాలను బలితీసుకున్నది. ఈ ఘటనతో మంత్రి పొన్నం ప్రభాకర్ మరింత బద్నాం అయ్యారని కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. 20 మందికి పైగా సజీవదహనం
అగ్నికీలలకు 30 మంది వరకు సజీవదహనం.. ప్రత్యక్ష సాక్షి కథనం ఇదీ.
సీటింగ్ పర్మిషన్ తీసుకొని స్లీపర్ బస్సుగా మార్చారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram