Minister Sitakka | ఎన్‌కౌంటర్‌లు చేసినా మార్పు రావడం లేదు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే దానిపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Sitakka | ఎన్‌కౌంటర్‌లు చేసినా మార్పు రావడం లేదు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై దుష్ప్రచారం
బస్సులో ఎల్లిపాయలు ఒలుస్తే తప్పా
మహిళా భద్రతపై ‘మార్పు’ స్పెషల్ డ్రైవ్

Minister Sitakka | రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే దానిపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్త్రీనిధి సర్వసభ్య సమావేశానికి మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. బస్సులో మహిళలు ఎల్లిపాయలు ఒలిచారని, అల్లికలు చేసుకుంటున్నారని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దుర్వినియోగమైందన్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు. దూర ప్రాంతాలకు ఫ్రయాణిస్తున్న క్రమంలో బస్సులో ఖాళీగా కూర్చొని టైం ఎందుకు వేస్ట్ చేయాలని ఎల్లిపాయలు ఒలుచుకున్నారని.. అదేమైనా తప్పా? – మంత్రి సీతక్క ప్రశ్నించారు. అదిలాబాద్ నుంచి ప్రయాణం రెండు గంటలు పడుతుందని ఆ సమయం కలిసొస్తుందని మహిళలకు జీవనాధరంగా ఉన్న అల్లిక పని చేసుకుంటే అది కూడా తప్పేనా అని నిలదీశారు. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే మహిళలు తిరుగుబోతులు అనేలా కొంతమంది యూట్యూబ్ చానెళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారని మంచి చెడు అనేది వ్యక్తిగత ప్రవర్తన ఆధారంగా ఉంటుందని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు మహిళలంటే ఎందుకు ఆక్రోశం అని ప్రశ్నించారు. ఇందంతా మహిళా లోకం ఆలోచన చేయాలన్నారు.

‘మార్పు’ స్పెషల్ డ్రైవ్

మహిళ భద్రత పెద్ద సవాలుగా మారిందని బయటకు వెళ్లిన మహిళ సురక్షితంగా ఇంటికి చేరుతుందనే నమ్మకం లేకుండా పోయిందని మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచారం టనను గుర్తు చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినందుకు మన రాష్ట్రంలోనూ రెండు మూడు ఎన్ కౌంటర్లు జరిగాయని అయినా మార్పు రాలేకపోయిందన్నారు. అందువల్ల మహిళలను గౌరవించడంపై మన ఇంటి నుంచే, తరగతి గది నుంచే అవగాహన కల్పించాల్సిన బాధ్యత స్త్రీనిధిలో సభ్యులుగా ఉన్న 64 లక్షల మంది సభ్యులపై ఉందన్నారు. అన్ని చోట్ల పోలీసుల చేత భద్రత అనేది వీలు పడకపోవచ్చని అటువంటి తరుణంలో మహిళల రక్షణ విషయంలో మహిళా సంఘాలు క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమాజంలో ఆర్థిక భద్రతతో పాటు సామాజిక రక్షణ అవసరం అని అందువల్ల ‘మార్పు’ అనే పేరుతో ఒక స్పెషల్‌ డ్రైవ్ ను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. దీని ద్వారా మహిళల రక్షణపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

స్త్రీనిధి అంటే మహిళల ఆర్థిక భద్రత అని, సమాజం సంతోషంగా ఉండాలంటే మహిళల ఆర్థిక ప్రగతి అవసరమని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అని తెలిపారు. అందువల్లే కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారన్నారు. స్త్రీనిధి సభ్యులు చేసే ఉత్పత్తులను విక్రయించుకునేందుకు శిల్పారామంలో మార్కెటింగ్ కోసం స్టాల్స్ ఏర్పాటు, అమ్మ ఆదర్శ పాఠశాలలు, స్కూల్స్ యూనిఫామ్స్ బాధ్యత మహిళా సంఘాలకు ఇచ్చిందని గుర్తు చేశారు.