నాడు పోలీసుల వేటలో.. నేడు పోలీసుల వెన్నంటే..!

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విధాత): పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) ఆదివారం మేడారం జాతర మహా జాతర ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. మంత్రి సీతక్క తన ప్రోటోకాల్ ను..కాన్వాయ్ ని సైతం పక్కన పెట్టి ములుగు ఎస్పీ శబరిష్ బైక్ పై కూర్చుని ప్రయాణిస్తూ రహదారులను పరిశీలించారు.

నాడు పోలీసుల వేటలో.. నేడు పోలీసుల వెన్నంటే..!
  • మేడారం జాతరకు నూతన రోడ్లు
  • దుష్ప్రచారాలు నమ్మెద్దు
  • ఆదివాసి సాంప్రదాయాన్ని కాపాడుతున్నా: మంత్రి సీతక్క

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విధాత): పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) ఆదివారం మేడారం జాతర మహా జాతర ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. మంత్రి సీతక్క తన ప్రోటోకాల్ ను..కాన్వాయ్ ని సైతం పక్కన పెట్టి ములుగు ఎస్పీ శబరిష్ బైక్ పై కూర్చుని ప్రయాణిస్తూ రహదారులను పరిశీలించారు. జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించేందుకు సూచనలు చేశారు.

మంత్రిగా హోదాను పట్టించుకోకుండా సీతక్క పోలీస్ అధికారి బైక్ పై కూర్చుని ప్రయాణించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజకీయాల్లోకి రాకముందు సీతక్క మాజీ నక్సలైట్ గా అజ్ఞాతంలో పనిచేశారు. నక్సలైట్ల వేటలో భాగంగా ఆనాడు పోలీసు బలగాలు సీతక్క దళం కోసం కూంబింగ్ ఆపరేషన్లు సాగించాయి. ఇప్పుడు అదే సీతక్క మంత్రి హోదాలో పోలీస్ అధికారి వెన్నంటే..పోలీస్ పర్యవేక్షణ..భద్రతా మధ్య అవే అటవీ ప్రాంతాల్లో పర్యటించిన పరిణామం నెటిజన్లలో ఆసక్తికరంగా మారింది.

ఆదివాసి పూజారుల ఆలోచన, విశ్వాసం నమ్మకం, ఆచారాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గుడిని అద్భుతంగా డెవలప్ చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. ఒక ఆదివాసి బిడ్డగా ఆదివాసి జీవితాన్ని తెలిసిన వ్యక్తిగా మొదటి నుంచి ఆదివాసి సాంప్రదాయాలు ఆచారాలను కాపాడుతున్నానన్నారు. గత ప్రభుత్వంలో కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే అడ్డుకున్నాని మంత్రి తెలిపారు. ఆదివాసి సంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా పనులు చేయించే బాధ్యత నాది అని మంత్రి వెల్లడించారు. కొంతమంది తమ ప్రయోజనాల కోసం దేవుడి దగ్గర చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. భక్తులు దుష్ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.

సమ్మక్క సారలమ్మ కీర్తి ఇనుమడింప చేసే విధంగా మేడారం ఆధునీకరణ పనులు జరుగుతాయని, మేడారం మహా జాతర సందర్భంగా నూతన రహదారులు అందుబాటులోకి తీసుకువస్తున్నమన్నారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు, ట్రాఫిక్ ఇక్కట్లను తొలగించేందుకు అడవి మార్గంలో నూతన రోడ్లను నిర్మిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. వచ్చే జనవరిలో జరిగే మహా మేడారం జాతరను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం పనులను వేగవంతం చేసిందని పేర్కొన్నారు.

కొండపర్తి నుంచి గోనెపల్లి ల, ముత్తాపురం మీదుగా పడికాపురం వరకు రహదారి సౌకర్యం కల్పిస్తున్నామని, కాల్వపల్లి నుంచి కన్నేపల్లికి వచ్చే దారిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. కాల్వపల్లి నుంచి ఊరటం వరకు వచ్చే దారిలో బీటీ రోడ్డు వేస్తున్నామన్నారు. అడవి దారులను డెవలప్ చేసుకుని వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా భక్తులందరూ మేడారం ఆలయం వరకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఛత్తీస్గడ్, ఖమ్మం వైపు నుంచి వచ్చే భక్తులకు చిన్నబోయినపల్లి మీదుగా ఊరటం దాకా రహదారి మార్గాన్ని కల్పిస్తాం. మేడారం మహా జాతర లోపు రూ 16.5 కోట్లతో కొండాయి బ్రిడ్జి కంప్లీట్ చేస్తామన్నారు. దీనికి సంబంధించి నిధులను సీఎం ఇప్పటికే మంజూరు చేశారన్నారు. సమ్మక్క సారలమ్మ కీర్తిని మరింత పెంచే విధంగా యజ్ఞంలా పనిచేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు.