Minister Sridhar Babu | వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా గుర్తించాలి: మంత్రి శ్రీధర్‌బాబు
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగి వందలాదిమంది మృతి చెందగా, వేలాదిమంది నిరాశ్రయులైన ఘటనను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా గుర్తించి ఆదుకోవాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు కోరారు.

విధాత, హైదరాబాద్ : కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగి వందలాదిమంది మృతి చెందగా, వేలాదిమంది నిరాశ్రయులైన ఘటనను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా గుర్తించి ఆదుకోవాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు కోరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 350 మందికి పైగా దుర్మరణం పాలైన వయనాడ్ విలయాన్ని కేంద్రం రాజకీయ కోణంలో కాకుండా మానవీయ దృక్పథంలో చూడాలన్నారు.
అతి భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్ కొండ చరియలు విరిగిపడే ఘటనలపై ముందస్తు హెచ్చరికలకు సంబంధించి ఒక మాన్యువల్ రూపొందించాలని అన్నారు. వయనాడ్ విషాదాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆర్ధికంగా కేరళ రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం ఒక రాష్ట్ర సమస్యగా వదిలేస్తే జాతి క్షమించదని, దక్షిణాదిలో ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ చోటుచేసుకోలేదన్నారు. దేశ ప్రజలు వయనాడ్ ప్రజలు అండగా నిలబడాలన్నారు.