అందుకే యూరియా అందించలేకపోతున్నాం: మంత్రి తుమ్మల
కేటాయింపుల ప్రకారం రాష్ట్రానికి యూరియాను సరఫరా చేయలేక పోవటం వలన ప్రస్తుతం రాష్ట్రంలో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

హైదరాబాద్, ఆగస్ట్ 18 ( విధాత): కేటాయింపుల ప్రకారం రాష్ట్రానికి యూరియాను సరఫరా చేయలేక పోవటం వలన ప్రస్తుతం రాష్ట్రంలో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. అందుకే రైతులకు పంటకు సరిపడా యూరియాను ఒకేసారి అందించలేకపోతున్నామన్నారు.రాష్ట్రంలో ప్రస్తుత యూరియా పరిస్థితులపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న లోటును దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్లకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత నిల్వలపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని, హోల్ సేల్, రిటైల్ డీలర్లు, సహకార సంఘాల గోదాములలో రోజువారి యూరియా స్టాక్ ను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయశాఖ నుండి వచ్చే రేక్స్ వివరాలను జిల్లా స్థాయిలో సమన్వయం చేసుకొని మండలాల వారీగా అవసరానికి అనుగుణంగా కేటాయింపు చేయాలని కలెక్టర్లకు సూచించారు.
యూరియా సరఫరాలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని, పెద్ద రైతుల అవసరాలకు విడతల వారిగా సరఫరా చేసే అవకాశాలను పరిశీలించాలని అన్నారు. అవసరమైతే పట్టాదారు పాసుపుస్తకాలు అనుసంధాన చేయాలన్నారు. రైతులకు టోకెన్లు జారీ చేసి ఎలాంటి గందరగోళం లేకుండా యూరియా సరఫరా చేయాలని, యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా, అన్ని శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పరిచి అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, రాష్ట్రాల మధ్య అక్రమ రవాణా అడ్డుకునేలా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. అధిక ధరలకు విక్రయించే లేదా ఇతర ఉత్పత్తులతో కట్టిపెట్టే ప్రైవేట్ డీలర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి, అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
పారిశ్రామిక అవసరాలకు సబ్సిడీ యూరియా మళ్లించే అవకాశమున్న యూనిట్లపై తనిఖీలు చేసి, వారి ఉత్పత్తి గణాంకాలు, బిల్లులు సరిపోల్చి, ఏమైనా పెద్ద వ్యత్యాసం ఉంటే డీలర్, యూనిట్‌పై కేసులు నమోదు చేయాలని తెలిపారు. యూరియా వినియోగాన్ని సమీక్షించేందుకు ప్రతి నెల Top 20 కొనుగోలుదారులు, తరచుగా కొనేవారు, అధికంగా అమ్మిన రిటైలర్ల వివరాలను (dbtfert.nic.in) వెబ్‌సైట్‌లో తనిఖీ చేయాలని, రైతులకు యూరియాను మితంగా ఉపయోగించాలనీ, నానో యూరియా, DAP, MOP, కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్, బయో-ఫెర్టిలైజర్స్ వంటివి వినియోగించమని ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.
స్థానిక మీడియా ద్వారా ప్రకటనలు విడుదల చేసి, రైతులకు ప్రభుత్వం సమయానికి సరఫరా చేస్తున్నదని నమ్మకం కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని, మండలాల వారీగా కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించి, వ్యవసాయశాఖ, పోలీస్, సహకార సంస్థలతో సమన్వయం చేసి పారదర్శకంగా పంపిణీ జరిగేలా చూడాలని అన్నారు. యూరియా సరఫరా సాధారణ స్థితికి చేరేవరకు కఠినంగా పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడే మాటలకు భయాందోళనలకు గురయ్యి యూరియాను అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని మంత్రి తుమ్మల రైతులను కోరారు.