రైతుబంధు.. పంట నష్టపరిహారంపై సీఎం రేవంత్‌రెడ్డి మోసాలు: జగదీశ్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి మోసపూరిత నాటకాలతోనే రైతు బంధు, పంట నష్టపరిహారం పంపిణీకి ఎన్నికల సంఘం బ్రేక్‌లు వేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు.

రైతుబంధు.. పంట నష్టపరిహారంపై సీఎం రేవంత్‌రెడ్డి మోసాలు: జగదీశ్‌రెడ్డి

బీఆరెస్ గెలుపుతోనే తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ
మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి

విధాత: సీఎం రేవంత్‌రెడ్డి మోసపూరిత నాటకాలతోనే రైతు బంధు, పంట నష్టపరిహారం పంపిణీకి ఎన్నికల సంఘం బ్రేక్‌లు వేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. బుధవారం నల్లగొండ పార్లమెంటు బీఆరెస్ పార్టీ విజయం కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతు బంధును వేసినట్టు చేసి మళ్లీ ఆగేలా చేసిన రేవంత్ ఎన్నికల ముందు రైతులను మోసం చేశాడని విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ దృష్టిలో పడాలనే రేవంత్ రైతుబంధు సహాయంపై డెడ్‌లైన్ ప్రకటనలు చేశాడని, రైతుబంధు, పంట నష్టపరిహారం ఇచ్చినట్లు చేసి ఈసీ ఆపినట్లు వ్యవహారం నడిపించాడని ఆరోపించారు.

రైతుల విషయంలో రాజీ లేదని ఓట్ల రాజకీయం మాకు అవసరంలేదని చెప్పి ఎన్నికల కమీషన్‌కు లేఖ రాయండి మద్దతిస్తామని గతంలోనే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టం చేశారన్నారు. యాసంగి రైతుబంధు సాయం అందకముందే ఖరీఫ్ సీజన్ మొదలైందని, ఖరీఫ్ రైతు భరోసా సహాయంపై సీఎం రేవంత్ ప్రమాణం, స్పష్టమై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

రైతు భరోసా ఇచ్చే ఉద్దేశంలేకనే కుంటి సాకులు చెబుతున్నాడన్నారు. రేవంత్ వ్యవహారం చూస్తే రైతు బంధు ఇక కొనసాగేలా కనిపించడంలేదని, రైతులకు ఇదే చివరి రైతు బంధులా కనపడుతుందన్నారు. అటు కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించిన కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాలను తమిళనాడుకు పంచే కుట్రకు బీజేపీకి మద్దతునిస్తుందని ఆరోపించారు.

తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్‌కు మద్దతునిచ్చి బీఆరెస్‌ను గెలిపించి బీజేపీ, కాంగ్రెస్‌లకు బుద్ది చెప్పాలన్నారు. కేపీల్లో ధాన్యం కొనుగోళ్ళు ఆలస్యం వల్లే అకాల వర్షాలతో నష్టం జరుగుతుందని, దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని, తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత కలెక్టర్లను ఆదేశించి అకాల వర్షాలతో నష్టపోయిన మామిడి, వరి రైతులను గుర్తించి, ఎన్నికలు ముగిసిన వెంటనే వారికి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.