ప్రభుత్వ ద్రోహం వల్లే పంటల నాశనం: ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
ప్రభుత్వం సకాలంలో నీటి విడుదల చేయక చేసిన ద్రోహం వల్లే పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు
 
                                    
            - కేసీఆర్ రైతుల చెంత…సీఎం క్రికెట్ మ్యాచ్‌లో
- రైతు దీక్షలో మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ధ్వజం
విధాత: ప్రభుత్వం సకాలంలో నీటి విడుదల చేయక చేసిన ద్రోహం వల్లే పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. రైతు సమస్యలపై బీఆరెస్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం అన్ని జిల్లా కేంద్రాల్లో రైతుదీక్షలు నిర్వహించారు. సూర్యాపేటలో నిర్వహించిన రైతు దీక్షలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామిలో భాగంగా ఇచ్చిన రైతు రుణమాఫీ, 500 బోనస్ లు ఏమయ్యాయని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ను అడ్డుపెట్టుకొని రైతు హామీలను ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
రైతుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి నిజమైన ప్రేమ ఉండి ఉంటే ఎన్నికల సంఘం అనుమతితో రుణమాఫీ,500 బోనస్ లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు బీఆరెస్ కూడా మద్దతుగా ఈసీకి లేఖ రాస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలన ప్రజా సంక్షేమం కంటే కుట్రలు కుతంత్రాలకే ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. కాళేశ్వరం పై చిల్లర ప్రేలాపనలు చేయడమే ఇందుకు అద్దం పడుతుందని ఆయన విరుచుకుపడ్డారు. పంట నష్టంపై సీఎం రేవంత్ రెడ్డితో సహా ఏ ఒక్కరూ ఎందుకు పెదవి విప్పడం లేదని ఆయన నిలదీశారు. పంటలు నష్టపోయి ఆర్థికంగా చితికిపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకే మండు టెండలను ఖాతరు చెయ్యకుండా బీఆరెస్ అధినేత కేసీఆర్ పోలం బాట పెట్టారన్నారు.
ఇవేమీ పట్టని సీఎం రేవంత్ రెడ్డితో సహా అధికార పార్టీ యంత్రాంగం మొత్తం క్రికెట్ మ్యాచ్‌లలో నిమగ్నమయ్యారని ఆయన విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు గజ దొంగల్లా దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కాంట్రాక్టర్లను,రైస్ మిల్లర్లను బెదిరించి మరీ వసూళ్లకు పాల్పదడమే ఇందుకు నిదర్శనమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ బాస్ ల చుట్టూ తిరగడమే సరి పోతుందన్నారు. ఇక్కడ వసూలు చేసిన దోపిడీ సొత్తును ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారన్నారు.
 
                     X
                                    X
                                 Google News
                        Google News
                     Facebook
                        Facebook
                     Instagram
                        Instagram
                     Youtube
                        Youtube
                     Telegram
                        Telegram