Palla Rajeswar Reddy | నీ ఆంధ్రా అల్లుడి బాగోతం బయటపెడుతాం :  కడియానికి పల్లా కౌంటర్

Palla Rajeswar Reddy | నీ ఆంధ్రా అల్లుడి బాగోతం బయటపెడుతాం :  కడియానికి పల్లా కౌంటర్

విధాత, వరంగల్: ‘మా పార్టీ కండువా మీద, కేసీఆర్ పేరు మీద గెలిచి, పదవులు, పైసల కోసం వేరే పార్టీకి పోయిన నువ్వు మా నీతి, నిజాయ‌తీల గురించి మాట్లాడుతావా?’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నేత కడియం శ్రీహరిని ప్రశ్నించారు. బుధవారం జనగామలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘చీము, నెత్తురు ఉంటే నిరూపించాలని అడిగినవ్ కదా! కడియం.. నీ అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్న నీ ఆంధ్రా అల్లుడి బాగోతం మొత్తం నిరూపిస్తాం’ అని ప్రకటించారు. దేవునూరులో అటవీ భూముల పక్కన 24 ఎకరాల భూమిని ఒక నెల రోజుల కింద నీ బినామీ పేరు మీద కొనలేదా? ఆ భూమికి రోడ్డు వేసుకోవడానికి, పక్కన భూమి వాళ్లను బెదిరించలేదా? అంటూ నిలదీశారు. నీ అధికార అహంకారం, నీ బిడ్డ ఎంపీ పదవిని అడ్డం పెట్టుకోని, నీ ఆంధ్రా అల్లుడు పోలీసు రిక్రూట్‌మెంట్లు ఎలా చేస్తున్నాడు? రెవెన్యూ అధికారులను గుప్పెట్లో పెట్టుకోని నీ కుటుంబం చేస్తున్న దౌర్జన్యాలను మొత్తం ప్రజల ముందు పెడతామని పల్లా తేల్చి చెప్పారు.