సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అసహనంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

బీఆరెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అసహనంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

పోచారం..సంజయ్‌ల చేరికలపై అసంతృప్తి
పార్టీకి రాజీనామా యోచన..బుజ్జగించిన మంంత్రి శ్రీధర్‌బాబు

విధాత, హైదరాబాద్ : బీఆరెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేరికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 65మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉందని,ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. పోచారం చేరిక అవకాశ వాద రాజకీయమన్నారు. ఇలాంటి ఫిరాయింపులను తాను వ్యక్తిగతంగా ప్రొత్సహించనని, ఏ రాజకీయ పార్టీయైన సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాల్సివుందని స్పష్టం చేశారు. జీవన్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజునే తన సొంత నియోజకవర్గం జగిత్యాల బీఆరెస్ ఎమ్మెల్యే సంజయ్‌ని సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు.

ఈ పరిణమాంతో జీవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైనట్లుగా తెలుస్తుంది. సంజయ చేరికపై తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 2014లో జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోయిన డాక్టర్ ఎం. సంజయ్ కుమార్‌.. ఆ తర్వాత జరిగిన 2018, 2023 ఎన్నికల్లో ఆయనపై విజయం సాధించారు. సంజయ్‌ చేరికపై జగిత్యాల కాంగ్రెస్‌ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచే జీవన్‌రెడ్డి ఇంటికి పార్టీ నాయకులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఒక దశలో జీవన్‌రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం కూడా వినిపించింది. అయితే పార్టీ అధిష్టానం ఆయనను బుజ్జగించేందుకు మంత్రి డి.శ్రీధర్‌బాబును, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను పంపించింది. వారు జీవన్‌రెడ్డితో భేటీయై ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయితే జీవన్‌రెడ్డి మాత్రం సంజయ్ చేరికపై తన అలకను వీడనట్లుగా తెలుస్తుంది.